వన మహోత్సవంలో తాటి, ఈత మొక్కలు

వన మహోత్సవంలో తాటి, ఈత మొక్కలు

హైదరాబాద్, వెలుగు: గౌడ సామాజిక వర్గం జీవనోపాధికి ఊతమిచ్చేలా ఈసారి వనమహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27.61 లక్షల ఈత, తాటి మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పంచాయతీరాజ్, అటవీశాఖలు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. గౌడ కులస్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు లేఖ రాశారు. దాని ఆధారంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొత్తం 27.61 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈత మొక్కలు 25.65 లక్షలు కాగా,  తాటి మొక్కలు 1.96 లక్షలు పెంచుతున్నారు.

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాబోయే వర్షాకాలంలో ప్రభుత్వ స్థలాల్లో,  ఖాళీ ప్రదేశాల్లో, చెరువు గట్లపై వీటిని పెద్ద ఎత్తున నాటేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు.  అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4.61 లక్షలు, కరీంనగర్ 2.01 లక్షలు, నిర్మల్ 1.74 లక్షలు, రంగారెడ్డి 1.47 లక్షలు, సూర్యాపేట 1.92 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో  గుంతలు తీసే ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్​డీఓ) లకు ఆదేశాలు అందాయి. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు, డీఆర్​డీఓలు  ప్రతిరోజూ ప్లాంటేషన్ పురోగతిని పర్యవేక్షించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారు కోరిన ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకం చేపట్టనున్నారు.  నాటిన మొక్కల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి నివేదించాలని డీఆర్డీఓలను ఆదేశాలందాయి. కాగా, ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం పట్ల గీత కార్మికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.