తగ్గిన వరి సాగు లక్ష్యం

తగ్గిన వరి సాగు లక్ష్యం
  • తగ్గిన వరి సాగు లక్ష్యం
  • నిరుటి కంటే 16.94 లక్షల ఎకరాలు తగ్గింపు

హైదరాబాద్‌, వెలుగు:ఈసారి వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుటి వానాకాలం కంటే 16.94 లక్షల ఎకరాల్లో సాగు తగ్గించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నిరుడు 61.94 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఈ సారి 45 లక్షల ఎకరాలకే పరిమితం చేసింది. బాయిల్డ్‌ రైస్‌ కాకుండా రారైస్‌ మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పడంతో రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వానాకాలంలో 1.42 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. నిరుడు వానాకాలంలో కోటి 29 లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా, ఈయేడు నిరుడు కంటే 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని టార్గెట్‌ పెట్టుకుంది. తాజాగా 2022 వానాకాలం సీజన్‌ వ్యవసాయ ప్రణాళికను ప్రకటించింది. అయితే అవసరమైన విత్తన ఏర్పాట్లను 87 శాతం ప్రైవేటు వ్యాపారులకే అప్పగించారు. ఈ సీజన్‌కు 20.25 లక్షల క్వింటాళ్లు విత్తనాలు అందుబాటులో ఉండగా 17.57 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేట్‌ సీడ్‌ కంపెనీలే సరఫరా చేయనున్నాయి. 48,945 క్వింటాళ్లు విత్తనాలను రైతులే స్వయంగా సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మిగిలిన విత్తనాలను సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నరు.


పత్తి, కంది సాగు పెంపు


ఈ వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తిపంట వేయడానికి రైతులను సిద్ధం చేస్తున్నారు. హైడెన్సీ సాగు పేరుతో  ఎకరానికి నాలుగు వేల ఆర్థిక సాయంచొప్పున రాష్ట్రంలో అదనంగా 50వేల ఎకరాల్లో కొత్త పద్ధతిని తీసుకొస్తున్నారు. ఇది నిరుటి కంటే 23.58 లక్షల ఎకరాలు ఎక్కువ. నిరుడు కాటన్ కు  మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో మద్దతు ధర కంటే రెండు మూడింతలు ఎక్కువ లభించింది. అలాగే కంది సాగును రెట్టింపు చేయాలని సర్కారు యోచిస్తోంది. నిరురు 7.64 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఈయేడు దాన్ని డబుల్‌ చేయాలని కనీసం 15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్లాన్‌ రూపొందించింది.

వానాకాలం పంటల టార్గెట్


పంట    విస్తీర్ణం
పత్తి    70,00,000
వరి    45,00,000    
కంది    15,00,000    
మొక్కజొన్న    5,00,000    
సోయాబీన్‌    3,50,000    
జొన్న    1,00,000    
పెసర    90,000    
మినుములు    50,000    
వేరుశనగ    35,000    
ఆముదం    25,000    
నువ్వులు    3,000    
సజ్జలు    2,000    
రాగులు    2,000    
పొద్దుతిరుగుడు    2,000    
ఇతర పంటలు    75,000    
మొత్తం    1,42,00,000