రెండో విడత సాదా బైనామాలను..క్రమబద్ధీకరించాలి

రెండో విడత సాదా బైనామాలను..క్రమబద్ధీకరించాలి

గతంలో పెద్ద మనుషుల సమక్షంలో తెల్ల కాగితాలపై వ్యవసాయ భూములు 2014 జూన్ 2లోపు అమ్మకాలు, కొనుగోలు చేసుకున్నవారికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో ఒకసారి, 2020లో మరోసారి, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సుమారు 20 లక్షల ఎకరాల భూములకు సంబంధించి 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

వీటిలో ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1.12 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో జగిత్యాల జిల్లాలో 35 వేల పైచిలుకు, కరీంనగర్ జిల్లాలో 27 వేల పైచిలుకు, పెద్దపెల్లి జిల్లాలో 35వేల పైచిలుకు, సిరిసిల్ల జిల్లాలో 15 వేల పైచిలుకు దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక పెండింగ్​లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న  రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు రాకపోవడంతో రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలకు నోచుకోవడం లేదు.  చాలా ఏళ్ల క్రితం భూములు అమ్ముకున్న యజమానులు 2020 అక్టోబర్ చివరి వారంలో ధరణి పోర్టల్ వెబ్​సైట్ అందుబాటులోకి రావడంతో పాత రికార్డుల ప్రకారం తమ పేరిట భూములు ఉన్నట్లు రికార్డుల్లో చూపెట్టడంతో పాత భూయజమానులు ధరణిలోని లోపాలను ఆసరా చేసుకుంటున్నారు.  

దొడ్డిదారిలో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయి తమ పేరిట పట్టాలు చేయించుకొని మోసాలకు పాల్పడుతున్నారు. సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు.  రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన లేక రిజిస్ట్రేషన్ ఖర్చులను భారంగా భావించిన చాలామంది రైతులు తెల్ల కాగితాలపై రాసుకున్నారు. ఆ  ఒప్పందపత్రాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు చూపించి గతంలో ఉన్న పహానిలోని అనుభవదారు కాలములో నమోదు చేయించుకుని ధీమాగా ఉండేవారు. ఇలాంటి ఒప్పందాలు తెల్ల కాగితాలపై రాసుకున్నవి కాబట్టి రెవెన్యూ అధికారులు జమాబంది అమలు చేయలేదు.

29 అక్టోబర్​ 2020 వరకు వచ్చిన 

సాదా బైనామా దరఖాస్తులు క్రమబద్ధీకరించాలి భూరికార్డులు ప్రక్షాళన చేసిన సమయంలో పట్టాదారు పాసుపుస్తకాలు అందుకోని రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. 2016లో ప్రభుత్వం  లక్షల సంఖ్యలో వచ్చిన సాదా బైనామాల్లో అత్యధిక శాతం పరిష్కరించినప్పటికీ సమాచారం లేక దరఖాస్తు చేసుకొనని రైతులు ఇంకా లక్షల్లో ఉండడం విశేషం.  సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించి 12 అక్టోబర్ 2020 నుంచి 30 అక్టోబర్ 2020 వరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు అనుమతి ఇచ్చింది. ఆ తరువాత మరో 10 రోజులపాటు అనగా 10 నవంబర్ 2020 వరకు గడువు పొడిగించడం వలన రెండు విడతల్లో 12 లక్షల దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. 

అప్పటికి అనగా 29 అక్టోబర్ 2020 రోజున ధరణి పోర్టల్​కు సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కొందరు దరఖాస్తుదారులు హైకోర్టును ఆశ్రయించగా గౌరవ హైకోర్టు వారు తేదీ 29 అక్టోబర్ 2020 లోగా వచ్చిన దరఖాస్తులకు చట్టబద్ధతతో కూడిన క్రమబద్ధీకరణకు అనుమతి ఇచ్చింది. అయినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో చాలామంది రైతులు ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, రైతుబీమాకు అర్హులు కాకపోవడమే కాకుండా వాళ్ల భూమి హక్కులకూ దిక్కులేకుండాపోయింది. 

13బి పత్రాల జారీ అధికారాన్ని ఆర్డీవో, తహసీల్దార్లకు ఇవ్వాలి

సాదా బైనామాల దరఖాస్తులు పెండింగ్​లో ఉండడం వల్ల భూములు కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కాలేదు. కానీ కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్ లో మాత్రం అమ్మిన రైతుల పేర్లే కనిపిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు పాత భూ యజమానులు సంబంధిత రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై దొంగ చాటుగా పాసుపుస్తకాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డులు పూర్తిగా కలెక్టర్ పరిధిలో ఉన్నందున ఇట్టి చట్టాన్ని సవరణ చేసి కలెక్టర్ల ఆదేశానుసారం తహసీల్దార్లకు లేదా ఆర్డీవోలకు 13- బి పత్రాల జారీ అధికారాన్ని అప్పగించాలి. వారి ద్వారా  క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేసే విధంగా చర్యలు తీసుకొని రైతుల హక్కులను కాపాడాలి. అలాకానట్లయితే, కలెక్టర్ లే 9.24 లక్షల దరఖాస్తులు పరిష్కరించాలంటే సాధ్యం కాదు. దీనివలన ఆలస్యం అయ్యే కొద్దీ భూముల విలువలు పెరిగి అమ్మకందారులు కొనుగోలుదారుల మధ్య గొడవలు పెరిగి హత్యల వరకు దారితీస్తుందనే విషయాన్ని నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. 

న్యాయం కోసం ధరణి రద్దును రైతులు కోరుకున్నారు

కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని సాదాబైనామా రైతులు భావించారు. రైతుబందు, రైతుబీమా కోసం కాకుండా  తమ భూములపై హక్కులు కోల్పోకుండా ఉండడానికే  రైతులు కొత్త ప్రభుత్వాన్ని  కోరుకున్నారన్నారు.  గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం ధరణి పోర్టల్ రద్దు మీద అనగానే రైతులు కాంగ్రెస్​ ప్రభుత్వం రావాలని కోరుకున్నారంటే  ధరణి పోర్టల్ రద్దు ఎంత ఆవశ్యకమో అర్ధం చేసుకోవచ్చు.  కాబట్టి వెంటనే రైతుల భూయాజమాన్య హక్కులను కాపాడడం కోసం సత్వర చర్యలు తీసుకొని పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని  రైతుల పక్షాన కోరుతున్నాము.

హైకోర్టు చెప్పినా గత ప్రభుత్వం చేయలె

ధరణి పోర్టల్ రాకముందు  స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి 13-బి  పత్రాలను జారీ చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 29 అక్టోబర్ 2020 తర్వాత స్వీకరించిన దరఖాస్తులను పక్కన పెట్టాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నా  ప్రభుత్వం పట్టించుకోలేదు.  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం. 29 అక్టోబర్ 2020 వరకు స్వీకరించిన 9.24 లక్షల దరఖాస్తులను పాత ఆర్ఓఆర్ చట్టం ప్రకారం పరిష్కరించడానికి ఎలాంటి అభ్యంతరం లేకున్నా ప్రభుత్వం కాలయాపన చేసింది. స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న కేసుల్లో తప్ప సంబంధిత అధికారుల చేత పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసి రైతులను రేవంత్ రెడ్డి​ ప్రభుత్వం ఆదుకోవాలి. 

భూ వివాదాలతో రోజూ ఇద్దరు రైతుల ఆత్మహత్య

ధరణి సమస్యల కారణం వల్లనో లేదా ప్రభుత్వం అభివృద్ధి పేరిట ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ కారిడార్ పేరిట పట్టణాల పక్కనే ఉన్న పచ్చని భూముల్లో చిచ్చు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని సామాన్య రైతుల నోట్లో మట్టికొడుతున్నది.   దీని వల్ల సగటున రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.  ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.