తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రారంభం కానున్న ఇంగ్లీష్ మీడియం..?

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రారంభం కానున్న ఇంగ్లీష్ మీడియం..?

హైదరాబాద్, వెలుగు:

ఆంధ్రప్రదేశ్​లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లిష్​మీడియం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అమలు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. రాష్ర్టంలోనూ ఇంగ్లిష్​ మీడియం స్కూళ్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రెండ్​కు అనుగుణంగా పేరెంట్స్ ఇంగ్లిష్​ వైపే మొగ్గు చూపుతుండటంతో సర్కారూ ఆ వైపు ఆలోచనలు చేస్తోంది. త్వరలోనే రాష్ర్ట విద్యాశాఖ అధికారుల బృందం ఏపీలో పర్యటించి, అక్కడ ఎలా అమలు చేయబోతున్నారనే విషయాన్ని స్టడీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నార్త్​లోని దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ ప్రైమరీ స్థాయి వరకూ మాతృభాషలోనే బోధన సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అమలు చేయాలా వద్దా? అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం.

2008లోనే సక్సెస్ ​స్కూల్స్

రాష్ర్టంలో 42 వేలకు పైగా స్కూళ్లుండగా, వాటిలో 58.06 లక్షల మంది స్టూడెంట్స్​చదువుతున్నారు. మెజార్టీ స్కూళ్లు సర్కారు పరిధిలోనే ఉన్నా, స్టూడెంట్లు మాత్రం ప్రైవేటు స్కూళ్లలోనే పెద్ద సంఖ్యలో చదువుతున్నారు.

ప్రైమరీ స్థాయి వరకూ విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగాలని రాష్ర్టం ప్రభుత్వం మొదటి నుంచీ భావిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కేంద్రీయ విద్య సలహామండలి సమావేశంలోనూ ఈ విషయాన్ని మంత్రి సబిత ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్లన్నీ దాదాపు ఇంగ్లిష్ మీడియంలోనే కొనసాగుతున్నాయి. ఈ కారణంగా సర్కారు బడుల్లో తెలుగు మీడియంతోనే ముందుకు పోతే అనుకున్న లక్ష్యం నెరవేరదనే వాదనా ఉన్నది. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్​ మీడియం కూడా సమాంతరంగా ప్రారంభిస్తే బాగుంటుందనే భావనా ఉంది. ఏపీ సర్కారు ఇంగ్లిష్​మీడియం స్కూళ్ల అంశం తెరమీదికి రావడంతో రాష్ర్ట సర్కారు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

సుమారు 10,700 ప్రైవేటు స్కూళ్లుంటే, వీటిలోనే 31.19 లక్షల మంది చదువుతుండటం గమనార్హం. ప్రైవేటు స్కూళ్లలో గతేడాదితో పోలిస్తే ఒక శాతం స్టూడెంట్స్ పెరిగారు. వాటిలో ఇంగ్లిష్​ మీడియం ఉండటమే ఈ వ్యత్యాసానికి కారణమని ఎక్స్​పర్టులు చెప్తున్నారు. సర్కారు విద్యాసంస్థలైన మోడల్​స్కూళ్లు, గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండటంతో అక్కడ సీట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. దీంతో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పెట్టాల్సి వస్తోంది. కానీ తెలుగు మీడియంతో కొనసాగుతున్న సర్కారు స్కూళ్లలో మాత్రం ఏటా స్టూడెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ర్టంలో 2008లోనే సక్సెస్​స్కూళ్ల పేరుతో గవర్నమెంట్​హైస్కూళ్లలో ఇంగ్లిష్​ మీడియం ప్రారంభించారు. ప్రస్తుతం ఆ స్కూళ్లు 1,800 వరకు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఈ నాలుగైదు ఏండ్లలో సుమారు ఐదువేల ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్​ మీడియం ప్రారంభించారు. టీచర్లకు ఇంగ్లిష్​మీడియం బోధనపై శిక్షణ ఇచ్చి, వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. తొలిసారిగా టీఆర్టీ ద్వారా 559 ఎస్జీటీ ఇంగ్లిష్​ మీడియం పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తే, అక్కడి టీచర్లు ఇంగ్లిష్​మీడియం బోధిస్తామని హామీ ఇస్తేనే కొత్తగా పర్మిషన్ ఇస్తున్నారు.