దళిత ప్రజాప్రతినిధులకు దక్కని గౌరవం ..అంత్యక్రియల్లో అధికారిక లాంఛనమేదీ?

దళిత ప్రజాప్రతినిధులకు దక్కని గౌరవం ..అంత్యక్రియల్లో అధికారిక లాంఛనమేదీ?
  • నిన్న గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచందుకు నో
  • మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నదీ అదే పరిస్థితి
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు
  • బీఎస్పీ చీఫ్​ ఆర్ఎస్పీ, టీపీసీసీ ఫైర్
  • గతంలో కేసీఆర్ కు నచ్చిన పలువురు సినిమా వాళ్లకూ దక్కిన గౌరవం

హైదరాబాద్: అంత్యక్రియల్లో తెలంగాణ దళిత ప్రజాప్రతినిధులపై సర్కారు వివక్ష చూపుతోంది. పదవుల్లో ఉండి కన్నుమూసినా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు, నిన్న గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం గమనార్హం. సాక్షత్తూ సీఎం, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సాయిచంద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.. కొందరు మంత్రులు అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. కానీ అధికారిక లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం గమనార్హం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పదవుల్లోపనిచేసి తనువు చాలించిన సినీ ప్రముఖులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు, సర్కారే దగ్గరుండి ఏర్పాట్లు చూసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. దీనిపై బీఎస్పీ రాష్ట్ర​ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. దళిత బిడ్డలపై సర్కారు వివక్ష చూపుతోందని మండిపడ్డారు.

‘ఎంతో మంది సినీ ప్రముఖులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, తన జీవితాన్ని పాటకు అంకితం చేసి, తెలంగాణ ఉద్యమానికి, అంబేద్కర్ భావజాలానికి ఊపిరూదిన ప్రజా గాయకుడు సాయిచందుకు కూడా అదే గౌరవం ఇవ్వాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టం. అహంకారపూరితం’అంటూ మండిపడ్డారు. ఇదే అంశంపై ట్విట్టర్ లో టీపీసీసీ సైతం రియాక్ట్ అయ్యింది. ‘నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న.. నేడు ఉద్యమకారుడు సాయి చంద్.. దళిత నేతలపై అదే కక్ష .. అదే వివక్ష.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఈ బిడ్డలు అర్హులు కారా? ఏపీ ప్రముఖులకు.. ఆఖరికి నిజాం వారసుడి అంత్యక్రియలకు ఇచ్చిన గౌరవం..తెలంగాణకోసం బతుకులని ధారపోసిన ఈ దళిత నేతలకు ఎందుకు దక్కదు?అంటూ ట్విటర్ లో నిలదీసింది. తెలంగాణ ఉద్యమానికి గళమై.. కేసీఆర్ అధికారంలోకి రావడానికి గొంతుకై అప్పటికప్పుడు కై గట్టి, గజ్జె కట్టి పాడపాడిన సాయిచంద్ విషయంలోనూ తెలంగాణ సర్కారు ఇలా వ్యవహరించడం పట్ల దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.