అడవి బిడ్డలపై రాష్ట్ర సర్కారు  దమనకాండ

అడవి బిడ్డలపై రాష్ట్ర సర్కారు  దమనకాండ

పోడుభూములకు పట్టాలియ్యాలని, అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్న ఆదివాసీలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అపరిష్కృతంగా ఉన్న పోడుభూముల సమస్యలు పరిష్కరించకుండానే సాగుచేస్తున్న భూముల్లో హరితహారం నిర్వహిస్తూ గిరిజనులను ప్రభుత్వం నయవంచనకు గురిచేస్తోంది. 2018 నవంబర్‌‌ 23న మహబూబాబాద్‌‌ లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్​మాట్లాడుతూ అవసరమైతే  కుర్చీవేసుకుని మరీ స్వయంగా పర్యవేక్షించి పోడుభూముల పట్టాల సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. మొత్తం అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టుకొని గిరిజన ప్రాంతాల్లో తిరిగి అర్హులందరికీ పట్టాలిస్తామన్న ఆయన మాటలు బూటకమని తేలిపోయింది.


పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజనుల వద్ద అక్టోబర్‌‌ నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, నవంబర్‌‌లో సర్వే ప్రారంభించాలని, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత పట్టాలివ్వాలని 2021 అక్టోబర్‌‌లో సీఎం కేసీఆర్‌‌ నిర్వహించిన హైలెవల్‌‌ మీటింగ్‌‌లో నిర్ణయించారు. 2019లో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నుంచి ఇప్పటివరకు పోడుభూముల సమస్య ఎక్కడిదక్కడే ఉంది.  పట్టాల కోసం ఒకవైపు గిరిజన ప్రజలు ఆందోళన చేస్తుండగా మరోవైపు ఫారెస్టు అధికారులు హరితహారానికి సిద్ధమవుతున్నారు. దీంతో అనేక జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంటోంది. ఇప్పటికే మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన మహిళలపై లాఠీచార్జి చేసి అక్రమ కేసులు బనాయించారు. మహిళలని కూడా చూడకుండా సర్కారు వాళ్లను జైళ్లకు పంపింది.

అటవీ హక్కుల గుర్తింపు చట్టం

దేశ పార్లమెంటులో 2006, డిసెంబర్‌‌15న అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఆమోదం పొందింది. ఫలితంగా వందల ఏండ్లుగా అడవినే నమ్ముకున్న గిరిజనులు, 75 ఏండ్లు ఏజెన్సీలో నివాసం ఉంటున్న గిరిజనేతరులకు కూడా ఈ చట్టం హక్కులను కల్పిస్తోంది. ఈ చట్టం ద్వారా అడవిగా గుర్తించిన, నిర్వచించిన రిజర్వు ఫారెస్ట్‌‌ లు, అభయారణ్య జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణకేంద్రాల్లో 2005 డిసెంబర్‌‌ 13 కన్నా ముందు నివసిస్తున్న, సాగుచేస్తున్న వారిని గుర్తించి వారికి వ్యక్తిగత, సామూహిక హక్కులు కల్పించాల్సిన ఉద్దేశంతో చట్టాన్ని తీసుకువచ్చారు. వీటితో పాటు అటవీ ప్రాంతాల్లో చేపలు పట్టడం, ఔషధ మొక్కల పెంపకం, తునికాకు, తేనె, వెదురు, జీగురు, చీపుర్లు తదితర అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి 13 రకాల హక్కులను కల్పించాలని చట్టంలో ఉంది. ఈ చట్టం వల్ల అడవిపై ఫారెస్ట్‌‌ శాఖ గుత్తాధిపత్యం పోయి పీసా చట్టం ద్వారా గ్రామసభలకు విశేష అధికారాలు ఇచ్చి గిరిజనుల వెన్నుదన్నుగా ఉంటాయని ఆశించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా గ్రామస్థాయి కమిటీ ఎఫ్‌‌ఆర్‌‌సీ, సబ్‌‌ డివిజనల్‌‌ కమిటీ ఎస్‌‌డసీ నియోజకవర్గస్థాయి, జిల్లా ఫారెస్ట్‌‌ కమిటీ డీఎఫ్‌‌సీ ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో రాష్ట్రస్థాయిలో మానిటరింగ్‌‌ కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరపాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ స్థానిక గిరిజనుల భాగస్వామ్యం లేకుండా కమిటీలు ఏర్పడ్డాయి. అధికారులే వీటి బాధ్యతను భుజాన వేసుకొని పోడు చేస్తున్న సాగుదారులకు మొండి చేయి చూపారు. ఫలితంగా చట్టం అమలు ఒక ప్రహసనంగా మారింది.

చట్టానికి తూట్లు పొడుస్తున్న సర్కారు

ఏజెన్సీ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన గిరిజన సంక్షేమశాఖ తన భాధ్యతల నుంచి తప్పుకున్నది. ఒకటి, అర ట్రైనింగ్‌‌ కేంద్రాలు పెట్టినా చట్టం ఉద్దేశాన్ని ప్రభుత్వ యంత్రాంగం మెదళ్లలోకి ఎక్కించుకోలేదు. ఫలితంగా సాగు చేస్తున్న పోడుభూముల అర్జీలు సబ్‌‌-డివిజన్‌‌ స్థాయిలో చిత్తు కాగితాల్లా మిగిలాయి. పోడుభూముల పట్టాల కోసం మూడున్నర లక్షల మంది ఎదురుచూస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజన గ్రామాలకు సంప్రదాయక సరిహద్దులుంటాయి. అసలు గిరిజనుల జీవన విధానమే సామూహికం. వేట, జాతర్లు, పండుగలు, అటవీ ఉత్పత్తుల సేకరణ, వంటచెరుకు, పశువులమేతకు సమస్తం అడవిపైన ఆధారపడతారు. చేసే పనులు గ్రామంలో సాముహికంగా చేపడతారు. అందుకే అటవీ హక్కుల చట్టంలో అధ్యయనం 1, సెక్షన్‌‌ (2) సాంప్రదాయక ఉమ్మడి హక్కులు కల్పించాలని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం ఉద్దేశానికి తెలంగాణ సర్కారు తూట్లు పొడుస్తోంది.

అడవి బిడ్డల హక్కులు గుర్తించాలి

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటవీ హక్కుల చట్టం అమలు చేయడమంటే అడవిపై ఆధారపడ్డ ఆదివాసులకు భరోసా కల్పించడమే. ముందు చట్టాన్ని అర్థం చేసుకొని అమలు చేసే యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. అడవిపైనే ఆధారపడ్డ చెంచు, గోండు, కోలాం, కోయ, నాయక పోడు, కొండరెడ్ల తెగలకు న్యాయం చేయాలి. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసే అధికారం గ్రామసభకే ఉన్నదని ప్రభుత్వం గుర్తించాలి. అటవీ హక్కుల కమిటీ నివేదికపై తుది నిర్ణయం గ్రామసభ నిర్ధారించాలి. లేకపోతే అటవీశాఖ పెత్తనం మాత్రమే కొనసాగుతుంది. రాష్ట్రస్థాయిలో ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో మానిటరింగ్‌‌ కమిటీ ఏర్పాటు చేసి సమస్య ఉన్నచోట త్వరితగతిన పరిష్కారమార్గాలకు ఉత్తర్వులు ఇవ్వాలి. గిరిజన సంక్షేమశాఖను నోడల్‌‌ ఏజెన్సీగా నియమించాలి. ఫారెస్ట్‌‌, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

పట్టాలియ్యకుంటే పోరాటమే

గిరిజనులకు12 శాతం రిజర్వేషన్లు అంటూ కేసీఆర్‌‌ ప్రగల్బాలు పలికారు. తెలంగాణలో10 శాతంగా ఉన్న గిరిజనులకు12 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధం కాదని తెలిసినా అసెంబ్లీ తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డినెన్స్‌‌ తీసుకువచ్చి గిరిజనులకు10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా కేసీఆర్‌‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.  ప్రభుత్వం వెంటనే అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో లోటు పాట్లు సవరించి పోడు భూములపై ఆధారపడ్డ ఆదివాసీలకు న్యాయం చేయాలి. వారిపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి. లేదంటే ప్రభుత్వం పోడు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. పోడుభూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టకపోతే వారి తరఫున బీజేపీ పోరాడుతుంది. 

హామీలన్నీ ఉత్తయేనా?

గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆ మాటకొస్తే గిరిజనులు, దళితులు, బలహీనవర్గాలంటేనే కేసీఆర్‌‌కు చిన్నచూపు. గిరిజనులు, దళితులకు మూడు ఎకరాలభూమి ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. దళితున్నే సీఎంను చేస్తామన్నా హామీని అటకెక్కించారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు రాష్ట్ర కేబినెట్‌‌లో ప్రాధాన్యం కల్పించలేదు. ‘‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు’’ఎన్నికలప్పుడు గిరిజన, దళిత, బలహీన వర్గాల జపం చేసే కేసీఆర్‌‌ ఎన్నికల పబ్బం గడవగానే వారి అభివృద్ధి ఊసే ఎత్తరు. దేశంలో అటవీ హక్కుల చట్టం ఏ మాత్రం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణనే. 

బండి సంజయ్‌‌ కుమార్‌‌,
కరీంనగర్​ ఎంపీ,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు