ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితితో తెలంగాణ సర్కారు

ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితితో తెలంగాణ సర్కారు
  • జీతాలివ్వలేని స్థితిలో కేసీఆర్​ సర్కారు :ఎంపీ ఉత్తమ్​
  • కట్టిన ప్రాజెక్టులెన్ని? చేసిన అప్పెంత? 
  • కొత్త పింఛన్లు, వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్​మెంట్, ఎటుపోయాయని ప్రశ్న

న్యూఢిల్లీ, వెలుగు: ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితితో తెలంగాణ సర్కారు ఉందని, మితిమీరిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కొత్తగా కట్టిన ప్రాజెక్టులేవీ కన్పించడం లేదని, అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయన్నారు. మిగులు బడ్జెట్​గా ఉన్న  రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్​తో సమానంగా తెలంగాణ అప్పులు ఉన్నాయన్నారు. అప్పుల విషయంలో రాష్ట్ర సర్కారు అంకెలు తారుమారు చేసి చూపెడుతోందని కాగ్ రిపోర్టులు చెబుతున్నాయన్నారు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా గుర్తిస్తున్నట్లు కేంద్రం చెప్పిందన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2014లో  రూ.69 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు 2022 నాటికి రూ.3,12,191 కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలేమీ కొనసాగడం లేదన్నారు. కొత్త ఆసరా పింఛన్లు, ఫీజు రీయింబర్స్​మెంట్, వడ్డీలేని రుణాలు అతీగతీ లేవన్నారు. ఇష్టానుసారం అప్పులు చేయడం దేశానికి కూడా మంచిది కాదన్నారు. శ్రీలంకలా ఇండియా కాకూడదన్నారు. అప్పులు ఎందుకు చేస్తున్నారో చెప్పడానికి కేంద్రం సిద్ధంగా లేదన్నారు.