ఉపాధి పనుల పర్యవేక్షణకు గ్రామస్థాయిలో కమిటీలు!

ఉపాధి పనుల పర్యవేక్షణకు గ్రామస్థాయిలో కమిటీలు!
  • ప్రతి నెలా మొదటి వారంలో తనిఖీలు 
  • ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

హైదరాబాద్​,  వెలుగు : ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్​) అమలులో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నది.  గ్రామస్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.  ఉపాధి పథకాన్ని మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఈ నిఘా కమిటీల ఏర్పాటు చేస్తోంది. కొత్త వ్యవస్థతో ఉపాధి హామీ పథకం బలోపేతం కావడంతోపాటు డిజిటల్ ట్రాకింగ్, రియల్ టైమ్ రిపోర్టింగ్ ద్వారా అక్రమాలను అరికట్టడం, గోస్ట్ వర్కర్లు (షాడో కూలీలు), నిధుల దుర్వినియోగానికి చెక్​ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

ఇప్పటివరకు  రాష్ట్రస్థాయిలోనే నిఘా కమిటీలు ఉండగా.. తొలిసారిగా  గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో గ్రామస్థాయి కమిటీలో ఐదుగురు చొప్పున ప్రభుత్వ సిబ్బంది మెంబర్లుగా ఉంటారు. ఇతర గ్రామాల్లో వారిని మెంబర్లుగా నియమంచనున్నారు. ఈ కమిటీలు పనుల తీరు, కూలీల హాజరు, వారికి చెల్లింపులు తదితర వాటిపై పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా, ఉపాధి హామీలో సోషల్​ ఆడిట్​ తనిఖీల ప్రక్రియపై ఫోకస్​ పెట్టిన ప్రభుత్వం.. ఇక ప్రతి నెలా మొదటి వారంలో తనిఖీలు చేపట్టనున్నది. 

పనుల జాబితాను జిల్లా కేంద్రాల్లోని  సోషల్​ ఆడిట్​ కమిటీలకు ఉపాధిహామీ సిబ్బంది సమర్పించాలి. పనుల వివరాలు, పనులు ఎలా జరుగుతున్నాయి. నిధుల వివరాలు అందులో ఉండేలా జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, పీఆర్​ ఇంజినీరింగ్ అధికారులు దీనిపై దృష్టిసారించాల్సి ఉంటుంది. సోషల్​ ఆడిట్​లో గుర్తించిన అక్రమాలకు బాధ్యులైన వారి నుంచి నిధులు రికవరీ చేయడం, లేదా అక్రమాల తీవ్రతను బట్టి చర్యలు తీసుకోనున్నది.