
- నిత్యం 5 వేల టన్నులకు పైగా సరఫరా
- రాష్ట్రవ్యాప్తంగా 32 వేల టన్నుల స్టాక్
- రైతులు ఆందోళన చెందొద్దంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల కోటా 1.50 లక్షల టన్నుల కేటాయింపుల్లో భాగంగా రైళ్ల ద్వారా రోజువారీ 5 వేల టన్నులకు పైగా యూరియా సరఫరా జరుగుతోంది. మరోవైపు యూరియా కోసం సోమవారం సైతం అనేక ప్రాంతాల్లో క్యూలైన్లు, ఆందోళనలు కొనసాగాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32 వేల టన్నుల యూరియా స్టాక్ నిల్వ ఉందని, తాజాగా 20 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం వస్తున్న యూరియాను వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు సమన్వయంతో జిల్లాల వారీగా ప్రాథమిక సహకార సంఘాలకు రవాణా చేస్తున్నారు. ఈ మొదటి వారంలో మరో 29,700 టన్నుల యూరియా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి సరఫరా కానుంది. రైళ్ల నుంచి వచ్చిన యూరియా స్టాక్‌ను లారీల ద్వారా ప్యాక్స్‌కు తరలిస్తున్నారు. 15వ తేదీలోగానే ఈ నెల కోటా కేటాయింపులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో సరఫరా వేగవంతం కావడాన్ని బట్టి రాష్ట్ర రైతుల కష్టాలకు త్వరలోనే చెక్పడే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలో 32 వేల టన్నుల యూరియా స్టాక్
రాష్ట్రానికి సరఫరా జరిగిన యూరియాలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో మార్క్‌ఫెడ్ వద్ద 10 వేల టన్నులు ఉండగా, సొసైటీల్లో 10 వేల టన్నులు, డీలర్ల వద్ద 9 వేల టన్నులు, ఏఆర్ఎస్కేలలో అంతా కలిపి మొత్తం 32 వేల టన్నులు ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. గూడ్స్ రైళ్ల ద్వారా ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వేల్, జగిత్యాల, నాగిరెడ్డిపల్లి ప్రాంతాల్లోని రైల్వే స్టాక్ పాయింట్ల నుంచి ప్యాక్స్, డీలర్లకు చేరవేస్తున్నారు.
ఈ నెలలో వరి పొలాలకే భారీగా యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షాలతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు యూరియా అవసరాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నెల కేటాయింపులు వేగంగా సరఫరా చేస్తే సమస్య తగ్గుముఖం పడ్తుందన్న ఆశాభావంలో అధికారులున్నారు.