- ప్రభుత్వం తరఫున సంప్రదింపులు జరుపుతున్నం
- మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం సెక్రటేరియెట్ నుంచి జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని సీఎం రేవంత్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ‘మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి’ పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని ఆయన సూచించారు.
ప్రజాప్రభుత్వం చేపట్టిన సామాజక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్) డేటాను దగ్గర పెట్టుకొని ప్రతి మహిళకు చీర అందేలా చూడాలని, చీర అందించే సమయంలో ఆధార్‌ను తీసుకోవాలని, ముఖ గుర్తింపు చేపట్టాలని కలెక్టర్లకు తెలిపారు.
అవకాశం ఉన్నచోటల్లా మహిళలకు ప్రోత్సాహం
మహిళల ఉన్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని.. తాము వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన నిధులు విడుదల చేశామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కూళ్లలో రూ.534 కోట్ల పనులు చేపట్టామని, ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పామని ఆయన వెల్లడించారు.
మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే సీఎం నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపైనా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.
మహిళలు ఎదగాలనే ఉద్దేశంతో ఆకాశం రంగును చీరలకు ఎంచుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.
మీ పెట్రోల్ బంక్ ఎలా నడుస్తున్నది?
‘‘మీ సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా నడుస్తున్నది?” అని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. ‘‘బాగా నడుస్తున్నది. నెలకు రూ.4 లక్షల రాబడి వస్తున్నది” అని ఆమె తెలియజేశారు. ఇతర జిల్లాల నుంచి సంఘాలను అక్కడికి తీసుకెళ్లి వారి పని తీరు, రాబడిని ప్రత్యక్షంగా చూపించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.
డిజైన్లు ఎంతో బాగున్నయ్
తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. 9 మీటర్లు, 6 మీటర్ల చీరలు తమకు నచ్చినట్లు ఉన్నాయని.. ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
ఈ చీరలతో ప్రత్యేక గుర్తింపు
ఇందిరా మహిళా శక్తి చీరలు ఇవ్వడం ద్వారా తమకు యూనిఫాం వచ్చిందనే సంతోషం ఉందని ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ చీరలు ధరించడం ద్వారా తమ సంఘాల మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
