- దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసింది గాంధీ ఫ్యామిలీ: మహేశ్ గౌడ్
- బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్
అచ్చంపేట, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల్లో సీబీఐ, ఈడీ, ఈసీ కీలుబొమ్మలుగా మారాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఆయనకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జరిగిన సమావేశంలో మహేశ్‌గౌడ్ మాట్లాడారు.
ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదంతో పేదలకు లక్షలాది ఎకరాలను పంచారని, బ్యాంకుల జాతీయీకరణ వంటి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ఉక్కుమహిళ అని కొనియాడారు. కేంద్రంలోని పెద్దలు ఓట్ చోరీకి పాల్పడి అధికారాన్ని దక్కించుకుంటున్నారని, బిహార్ ఎన్నికలే అందుకు నిదర్శనమన్నారు. నెహ్రూ కుటుంబం ఆస్తులు, పదవులు, ప్రాణాలను సైతం త్యాగం చేసిందని.. అలాంటి నాయకత్వం ఏ పార్టీకైనా ఉందా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆలోచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో భ్రష్టు పట్టించారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. పదేండ్లలో కేసీఆర్ చేయని అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి రెండేండ్లలోనే చేసి చూపారన్నారు. రెండేండ్లలోనే తాము 70 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామని, రానున్న రోజులలో 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
