మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పెను ప్రమాదమే తప్పింది. యాసిడ్ ట్యాంకర్ నుంచి పొగలు వచ్చాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పొగలను అదుపులోకి తీసుకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు.
జగన్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించాలంటేనే పబ్లిక్ బిక్కుబిక్కుమంటున్నారు. జగన్ ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెప్పుకొచ్చారు.
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు కూడా హైదరాబాద్లో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే ఓవర్ హీట్ కారణంగా బస్సు టైర్లలో నుంచి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ పక్కకు ఆపాడు. మరో బస్సు అరేంజ్ చేస్తామని చెప్పడంతో 26 మంది ప్రయాణికులు తీవ్ర చలిలో రోడ్డు పైనే వేచివున్నారు. గంటల తరబడి చలిలో ఇబ్బంది పడినా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
