ఏసీబీ కేసులపై సర్కార్ నిర్లక్ష్యం..

ఏసీబీ కేసులపై సర్కార్ నిర్లక్ష్యం..

రాష్ట్రంలో ఏసీబీ కేసులు నీరుగారిపోతున్నాయి. లంచం కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల పక్కదారి పడుతున్నాయి. ఏసీబీ అధికారులు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా అవేవీ నిలవడం లేదు. కొన్ని కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండగా, మరికొన్నింటిని క్లోజ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల అండదండంలో ఈ కేసులు ముందుకు సాగడంలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల ఆర్టీఐ ద్వారా ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వెలుగులోకి తెచ్చిన పలు కేసుల వివరాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

విచారణకు అనుమతి ఏది?

అక్రమార్కులు దొరకగానే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విజిలెన్స్‌ కమిషన్‌కు లేఖ రాస్తారు. అందులో నిందితుడి అక్రమార్జన గురించి వివరిస్తారు. సాధారణంగా విజిలెన్స్‌ కమిషన్‌ కూడా ప్రభుత్వానికి ఇదే విషయం చెబుతుంది. దాంతో ఆ నిందితుడిపై న్యాయవిచారణకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు సర్కార్‌ను కోరుతారు. కానీ ఇక్కడ న్యాయవిచారణకు అనుమతి రాకుండా కొందరు అధికారులు తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. సచివాలయం కేంద్రంగా పెద్దాఫీసర్లు, నేతలతో పైరవీలు చేయిస్తుంటారు. ఏసీబీ లేఖను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టించుకుంటారు. చివరగా కేసు తీవ్రతను తక్కువగా చూపుతూ సదరు అధికారిపై న్యాయ విచారణ అవసరం లేదని, శాఖాపరమైన విచారణ సరిపోతుందనేలా ఉత్తర్వులు తెప్పించుకుంటారు. అదీ కాదంటే ట్రిబ్యునల్‌ ఫర్‌ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ లేదా కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌కో సిఫార్సు చేయించుకుంటారు. కేసు ఇక్కడకు వచ్చిందంటే దాని కథ ముగిసినట్టే!

ఏసీబీ అధికారుల ఎన్నిసార్లు కోరినా..

ఏసీబీ అక్రమార్కులను పట్టుకున్నా వారిని కోర్టు ముందు నిలబెట్టడానికి అధికారులు నానాపాట్లు పడాల్సి వస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్‌ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి లంచం తీసుకుంటుండగా 2010 ఫిబ్రవరి 4న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు కూడా నమోదు చేశారు. అతనిపై న్యాయవిచారణకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ పలుసార్లు కోరినా పట్టించుకోలేదు. కొన్నిసార్లు ప్రభుత్వం విచారణకు అనుమతి ఇచ్చినా ప్రయోజనం కన్పించడం లేదు. కింది కోర్టు నిందితుడికి శిక్ష విధిస్తే హైకోర్టుకు, అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అభియోగాలు నిర్ధారించి, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మాత్రమే అక్రమార్జన ప్రభుత్వ పరం అవుతుంది. కానీ ఏసీబీ చరిత్రలో ఇలాంటి ఒక్క కేసు కూడా తెలుస్తోంది.