యాసంగిలో పప్పు ధాన్యాలు, నూనె గింజలకు ప్రోత్సాహం

యాసంగిలో పప్పు ధాన్యాలు, నూనె గింజలకు ప్రోత్సాహం
  •     రాష్ట్రంలోని 21 జిల్లాల్లో సబ్సిడీపై విత్తనాల పంపిణీకి శ్రీకారం
  •     1.61 లక్షల ఎకరాల్లో సాగే లక్ష్యంగా భారీ ప్రణాళిక
  •     నూనె గింజలకు 36 కోట్లు.. పప్పుధాన్యాలకు15 కోట్ల ఆర్థిక సాయం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో నూనెగింజలు, పప్పుధాన్యాల సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రైతులకు సబ్సిడీపై విత్తనాలను అందించడంతో పాటు సాగు విస్తీర్ణాన్ని పెంచి పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించింది.  యాసంగిలో నూనెగింజలు, పప్పుధాన్యాలు కలిపి మొత్తంగా 1.61 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరి వంటి ప్రధాన పంటలతో పాటు నూనెగింజలు, పప్పుధాన్యాల సాగును విస్తరించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు ఊతమివ్వాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. 

ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందిస్తే ఖర్చు తగ్గి, దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో దేశీయంగా నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా వ్యవసాయ శాఖ పేర్కొంది.

విత్తనాల పంపిణీ ఇలా..!

కేంద్రం అమలు చేస్తున్న జాతీయ నూనెలు–నూనెగింజల మిషన్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎంఈఓ–ఓఎస్‌‌‌‌‌‌‌‌) కింద రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 2026–27లో ఈ పథకం కింద రూ.49.35 కోట్లు కేటాయించగా.. రూ.34.55 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్రం రూ.21.33 కోట్లు, రాష్ట్రం రూ.13.22 కోట్లు భరించనున్నాయి. వాల్యూ చైన్‌‌‌‌‌‌‌‌ క్లస్టర్ల ద్వారా 29,375 క్వింటాళ్ల నూనెగింజల విత్తనాలను 52,425 ఎకరాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.36.76 కోట్ల సబ్సిడీ అందించనున్నారు. ప్రధానంగా వేరుశెనగ, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వుల విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వేరుశెనగలో గిరినార్‌‌‌‌‌‌‌‌-4, గిరినార్‌‌‌‌‌‌‌‌-5, కదిరి లేపాక్షి, టీసీజీఎస్‌‌‌‌‌‌‌‌-894 రకాలు.. కుసుమలో ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌-764 (లక్ష్మీప్రియ).. పొద్దుతిరుగుడులో తిల్‌‌‌‌‌‌‌‌హన్‌‌‌‌‌‌‌‌ టెక్‌‌‌‌‌‌‌‌, సన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌-1, కేబీఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌-85.. నువ్వుల్లో జేసీఎస్‌‌‌‌‌‌‌‌-1020 రకాలను పంపిణీ చేయనున్నారు. 

అలాగే, పప్పుధాన్యాల్లోనూ ఆత్మనిర్భరత మిషన్‌‌‌‌‌‌‌‌ (ఎంఏఎన్‌‌‌‌‌‌‌‌పీ) కింద చర్యలు చేపడుతున్నారు. 2026-–27లో ఈ పథకానికి రూ.34.60 కోట్లు కేటాయించగా.. రూ.24.21 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం రూ.14.59 కోట్లు, రాష్ట్రం రూ.9.62 కోట్లు భరించనున్నాయి. ఈ యాసంగిలో 29,008 క్వింటాళ్ల పప్పుధాన్యాల విత్తనాలను 1.09 లక్షల ఎకరాలకు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. పప్పుశెనగలో 26,846 క్వింటాళ్ల విత్తనాలను 83,053 ఎకరాలకు, మినుములో 1,369.20 క్వింటాళ్లను 16,958 ఎకరాలకు, పెసరలో 793 క్వింటాళ్లను 9,801 ఎకరాలకు పంపిణీ చేయనున్నారు. పప్పుశనగలో ఎన్‌‌‌‌‌‌‌‌బీఈజీ-452, ఎన్‌‌‌‌‌‌‌‌బీఈజీ-47, ఎన్‌‌‌‌‌‌‌‌బీఈజీ-49.. మినుములో వీబీఎన్‌‌‌‌‌‌‌‌-8, వీబీఎన్‌‌‌‌‌‌‌‌-10.. పెసరలో ఎంజీజీ-385 రకాలను ప్రోత్సహించనున్నారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో సబ్సిడీపై విత్తనాల పంపిణీతో పాటు బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్థాయి ప్రదర్శనలు, సీడ్‌‌‌‌‌‌‌‌ మినీకిట్ల కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.15.25 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఆయిల్​ సీడ్స్​ కోసం  12 జిల్లాల్లో క్లస్టర్లు
నూనెగింజల సాగుకు ప్రత్యేకంగా వాల్యూ చైన్‌‌‌‌‌‌‌‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వేరుశెనగకు ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని జిల్లాలతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. పొద్దుతిరుగుడుకు సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల.. కుసుమకు రంగారెడ్డి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి.. నువ్వులకు ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, నిర్మల్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల జిల్లాలను ఎంపిక చేశారు.నూనెగింజల సాగులో ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడుల సాధనపై రైతులకు అవగాహన కల్పించేందుకు 1,200 ఎకరాల్లో బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వేరుశెనగ, కుసుమ పంటల్లో చేపట్టే ఈ ప్రదర్శనలకు 694 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసి రూ.43.97 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.