
- నెల నెలా దాటవేతే.. డబ్బులివ్వక పనులన్నీ ఎక్కడికక్కడే
- స్కీమ్‌లు... బిల్లులన్నీ పెండింగ్
- జూన్ తర్వాత ఆగిపోయిన ఆసరా
- పెళ్లికానుకలు, కేసీఆర్ కిట్లకు కటకట
- రైతుబంధు సాయం కొందరికి బంద్
- నియోజకవర్గాల అభివృద్ధి నిధులకు కత్తెర
- గ్రాట్యుటీ అందక రిటైర్ ఉద్యోగుల తిప్పలు
- అరిగోస పడుతున్న లబ్ధిదారులు
సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజి రూ.2.25 కోట్లతో నిర్మించారు. నిర్మాణం పూర్తి అయి ఏడాది కావస్తోంది. ప్రభుత్వం రూ.45 లక్షల బిల్లు పెండింగ్లో పెట్టింది. తనకు బిల్లు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ ఈ కాలేజీకి తాళం వేశాడు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ కోరినా.. కాంట్రాక్టర్ తాళం తీసేందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికీ కాలేజీ బిల్డింగ్కు తాళం వేసే ఉంది.
పెండింగ్ బిల్లులు.. కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు… రాష్ట్ర ఖజానా డొల్లతనానికి అద్దం పడుతున్నాయి. వివిధ విభాగాల్లో చేపట్టిన పనులు, అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లకు పైగా బాకీ పడింది. ప్రయారిటీ పథకాలుగా చెప్పకునే వాటికి సైతం నిధులివ్వకుండా దాటవేస్తోంది. సర్కారు బిల్లులు ఇవ్వకపోవటంతో ఇటీవల ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను మూడు రోజులు నిలిపేశాయి. మిషన్ భగీరథ బిల్లులు ఇవ్వలేదని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో వెహికల్ ఓనర్లు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.ఆసరా పెన్షన్లను డబుల్ చేసిన ప్రభుత్వం రెండు నెలలుగా పెన్షన్ల పంపిణీకి నిధులు ఇవ్వడం నిలిపేసింది. రికార్డుల పేరుతో చెప్పుకున్నంత ఆదాయం రాకపోవటం, భారీ మొత్తంలో తెచ్చిన అప్పులకు వడ్డీల మోత మోగటం, అంచనాలకు మించి ఖర్చులు పెరిగి పోవటం.. ఉన్న నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో ధారపోయటంతో.. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ గాడి తప్పినట్లయింది. ఏడాదిగా పేరుకుపోతున్న బకాయిలన్నీ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి.
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు జీతాలు తప్ప నెలనెలా ఠంచన్‌గా ఇవ్వాల్సిన పద్దులన్నీ ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ వస్తోంది. రిటైరయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ను ఏడు నెలలుగా నిలిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ప్రతి నెలా దాదాపు 500 మంది ఉద్యోగులు రిటైరవుతున్నారు. రూ.12 లక్షల గ్రాట్యుటీతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్కగడితే.. ఒక్కొక్కరికి కనీసం రూ.15 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రిటైరైన వారం రోజుల్లోనే వీటిని చెల్లించాలని స్వయంగా సీఎం ఆదేశించినప్పటికీ.,. నిధుల్లేకపోవటంతో ఏడు నెలలుగా వీటిని నిలిపేశారు. దీంతో దాదాపు రూ.420 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ఆగిపోయాయి.
జూన్ దాటితే సెప్టెంబరే
నెలనెలా చెల్లించే ఆసరా పెన్షన్లు ఈనెలది వచ్చే నెల.. తర్వాతది మరో నెల అన్నట్లుగా ప్రభుత్వం వాయిదా వేస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఆపన్నులతో పాటు నేత, గీత కార్మికులు, బీడి కార్మికులు, సింగిల్ ఉమెన్, హెచ్ఐవీ బాధితులు, ఫైలేరియా బాధితులు.. రాష్ట్రంలో దాదాపు 39 లక్షల మంది ఈ పింఛన్లు అందుకుంటున్నారు. వీరికి ప్రతినెలా రూ. 863 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉంది. ఫించన్లను డబుల్ చేసిన తర్వాత జూన్ నెలలో పంపిణీ చేసిన ప్రభుత్వం.. వరుసగా రెండు నెలలుగా పెండింగ్లో పెట్టింది. దీంతో రాష్ట్రమంతటా జులై, ఆగస్ట్ నెలలవి కలిపి దాదాపు రూ.1726 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వృద్ధాప్య ఫించన్ వయసును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించే నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వస్తుందా.. అని అర్హులైన వృద్ధులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.
కలెక్టరేట్లకు కిరాయిలు వస్తలేవు
కొన్ని చోట్ల ప్రైవేట్ భవనాల్లో ఉన్న కలెక్టరేట్లకు ప్రభుత్వం కిరాయిలు చెల్లించటం లేదు. మొదటి రెండేళ్లు క్రమంగా కిరాయి చెల్లించిన ప్రభుత్వం గత ఏడాదిగా నిధులు ఆపేసింది. పెండింగ్ అద్దె బిల్లులు కోట్లల్లోకి చేరాయి. స్వయంగా కలెక్టర్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా తమకు డబ్బులు రావటం లేదని ఓనర్లు చెబుతున్నారు.
పంచాయతీల నిధులకు ఫ్రీజింగ్
నిధుల కిరికిరితో స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లిస్తోంది. దీంతో పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ కాకుండా.. రాష్ట్ర ఖాతాలోనే ఆగిపోతున్నాయి. ఇటీవల రూ.334 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం వీటిని వాడుకోకుండా ట్రెజరీల్లోనే ప్రీజింగ్ పెట్టిందని సర్పంచులు విమర్శిస్తున్నారు.
రైతు బంధుకు కోత
ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతులందరికీ పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు పథకానికి ప్రభుత్వం కత్తెర పెట్టింది. 56.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన ఈ డబ్బును ప్రభుత్వం కొందరి ఖాతాల్లో వేసి.. అయిదెకరాలకు మించి భూములున్న రైతులకు చెప్పాపెట్టకుండా ఆపేసింది. దాదాపు రూ.2200 కోట్లకు పైగా బకాయిపడింది.
ప్రాజెక్టులకు బకాయిలే
కాళ్లేశ్వరం ప్రాజెక్టుకు మరో రూ.18 వేల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీగానే బిల్లులు పెండింగ్లో పెట్టింది. వివిధ ప్రాజెక్టు పనులకు రూ.10,500 కోట్లు పెండింగ్లో పెట్టింది. అందులో కాళేశ్వరం పనులకు రూ.2 వేల కోట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు రూ.1500 కోట్లు బకాయి పడింది. వీటితో పాటు గత ఏడాది చేపట్టిన మిషన్ కాకతీయ చెర్వుల పనులకు రూ.680 కోట్లు చెల్లించాల్సి ఉంది.
పెళ్లి కానుకకు నిరీక్షణ
నిరుపేద ఇళ్లల్లో ఆడ బిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెళ్లి కానుకలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో బిడ్డల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులు ప్రభుత్వం ఇచ్చే నగదు సాయం ఎప్పుడొస్తుందా అని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీటితో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించేందుకు అందించిన కేసీఆర్ కిట్లకు నిధుల కటకట మొదలైంది. ప్రభుత్వం అత్యంత గొప్పగా చెప్పుకునే ఈ రెండు పథకాలకు దాదాపు రూ.500 కోట్లు బకాయి పడింది. బేబీకి అవసరమయ్యే సబ్బులు, ఆయిల్ తదితర వస్తువులుండే కేసీఆర్ కిట్లను అన్ని జిల్లాల్లో ఆరోగ్య కేంద్రాలకు రవాణా చేసే ఏజెన్సీలకు బిల్లులివ్వకుండా తిప్పుకుంటోంది.