చేతికి రిపోర్టులు.. ఇక యాక్షన్! కాళేశ్వరం, విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు?

చేతికి రిపోర్టులు.. ఇక యాక్షన్! కాళేశ్వరం, విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు?
  • లీగల్​ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కార్​ నిర్ణయం
  • అవినీతి, అక్రమాలపై ప్రివెన్షన్​ ఆఫ్​ కరప్షన్ యాక్ట్​ ప్రకారం ముందుకు..!
  • ఇతర రాష్ట్రాల్లో అక్కడి కమిషన్లు ఇచ్చిన రిపోర్టులు, చర్యలపై స్టడీ
  • ఇప్పటికే విద్యుత్​ నివేదికపై కేబినెట్​లో చర్చ
  • కాళేశ్వరం రిపోర్ట్​పై చర్చకు ఈ నెల 4న ప్రత్యేకంగా కేబినెట్​ భేటీ.. ఈ నివేదికను 
  • సమ్మరీ చేసేందుకు కమిటీ ఏర్పాటు
  • రెండు రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని యోచన

హైదరాబాద్, వెలుగు: 
కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ కమిషన్లు సమర్పించిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. నివేదికల్లోని సిఫార్సుల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రధానంగా క్రిమినల్ కేసులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అవినీతి, అక్రమాలు, నిధుల గోల్‌‌మాల్ జరిగినట్లు నిర్ధారిస్తే ఏసీబీ వంటి సంస్థలతో కేసులు పెట్టాలని భావిస్తున్నది. 

అవినీతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై రాష్ట్ర సర్కార్​ అధ్యయనం చేస్తున్నది. ఇప్పటికే విద్యుత్​ కమిషన్​ రిపోర్టుపై కేబినెట్​లో చర్చించినందున.. కాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్​పై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 4న ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధ్యయనం  కోసం లా, జీఏడీ, ఇరిగేషన్ సెక్రటరీలతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.


నివేదికలోని ముఖ్య అంశాలను సంక్షిప్తంగా (సమ్మరీ రిపోర్ట్) కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమర్పించాలని కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత.. కాళేశ్వరం, విద్యుత్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనివల్ల రిపోర్టుల్లోని పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నది.  

చట్టపరమైన చిక్కులు లేకుండా..!

కాళేశ్వరం, విద్యుత్ కమిషన్ల నివేదికలపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్, 1952’ ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు కమిషన్లు ఏర్పాటు చేశాయి.. వాటి నివేదికలు.. ఆ నివేదికలపై ఆ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు.. అప్పుడు ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఏమిటనేదానిపై అధ్యయనం చేస్తున్నది. నివేదికలను హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో సవాల్​ చేసే అవకాశం ఉన్నందున.. అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. 

నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు. సాధారణంగా పక్షపాతం, అధికార పరిధి లేకపోవడం, లేదా సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన వంటి ఆరోపణలతో చర్యలు తీసుకోకుండా ఉండాలని కమిషన్ల రిపోర్టులపై బాధ్యులు (ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు) కోర్టు వెళ్లే అవకాశం ఉంది. ఉదాహరణకు పశ్చిమబెంగాల్​ ప్రభుత్వం వేసిన పెగాసెస్ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. కేంద్ర జాబితా అధికార పరిధిలో రాష్ట్రం విచారణ చేయలేదని పేర్కొంది. అయితే చాలా సందర్భాల్లో  కోర్టులు ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్, 1952’ను సమర్థించాయి. అందులో భాగంగానే ... అన్ని నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని, ఎక్కడా లీగల్​ సమస్యలు రాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ప్రజాప్రతినిధులు ఉండటంతో మరిన్ని జాగ్రత్తలు

కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలపై కమిషన్లు ఇచ్చిన నివేదికల్లో గత ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారులు, ఇంజనీర్ల నుంచి వచ్చిన ఆధారాల మేరకు వారి ప్రమేయం ఉన్నట్లు కమిషన్లు తేల్చినట్లు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్​ చేపట్టిన ఓపెన్ కోర్టు విచారణలో ఇంజనీర్లు, అధికారులు.. పైనుంచి వచ్చిన ఆదేశాలు, ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగాయని అంగీకరించారు. చాలా నిర్ణయాల్లో నాటి సీఎం, నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారని కూడా కొందరు పేర్కొన్నారు. ఈ విషయాలను కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. 

గత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వీరు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉన్నందున, అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక అవకతవకల విషయంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్  యాక్ట్​ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

విద్యుత్  రిపోర్ట్​పై ఇప్పటికే కేబినెట్​లో చర్చ

చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్​ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి. లోకూర్ నేతృత్వంలో గతంలో కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్  2024 అక్టోబర్ 28న తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్  నుంచి అధిక ధరకు విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్రానికి వేల కోట్ల అదనపు భారం పడిందని పేర్కొన్నట్లు సమాచారం. 

యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో పాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లిందని రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. విద్యుత్ కమిషన్ నివేదికపై ఇప్పటికే కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చించారు. చట్టబద్ధంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అభిప్రాయాలు తీసుకున్నది. 

సీఎంకు కాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్​

కాళేశ్వరంపై జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ స్పెషల్​ సెక్రటరీ ప్రశాంత్​ పాటిల్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, సీఎస్​ రామకృష్ణారావు నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.

 కమిషన్ ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇందులో నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయ శాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీని సభ్యులుగా ఉంటారు. నివేదిక పూర్తి సారాంశాన్ని రెడీ చేసి ఒకటీ రెండురోజుల్లో అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.