
- శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్ డబుల్ చేసే చాన్స్
- ఇప్పటికే మేడ్చల్ రెండు జోన్లు
- సర్కారు ఓకే అంటే హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 వేల చదరపు కి.మీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హెచ్ఎండీఏలో జోన్ల సంఖ్య పెంపు మరోసారి తెరపైకి వచ్చింది. రియల్ఎస్టేట్పుంజుకుంటున్న తరుణంలో బిల్డింగ్‌ల నిర్మాణాలు, లే అవుట్ల పర్మిషన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు జోన్ల సంఖ్యను రెట్టింపు చేయాలని సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి జిల్లాలు ఉండగా.. వీటిలోని 70 మండలాలు, దాదాపు 1,030 గ్రామాలు, పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో భారీ నిర్మాణాలు, కొత్త వెంచర్లు, లే అవుట్స్ చేయాలంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్పర్మిషన్ తప్పనిసరి. కాగా, ఇంత మొత్తంలో పర్మిషన్లు ఇవ్వాలంటే ఇప్పుడున్న జోన్లలోని ఆఫీసర్లు, సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఔటర్రింగ్రోడ్అవతల ప్రభుత్వం ట్రిపుల్ఆర్ ను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని చూస్తోంది. ఇదే జరిగితే హెచ్ఎండీఏలో మరికొన్ని జిల్లాలు కలుస్తాయి. ప్రస్తుతం 7,224 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న హెచ్ఎండీఏలోకి మరో 4 వేల చదరపు కిలోమీటర్లు కలిసే చాన్స్ఉంది. ఈ క్రమంలో మూడు జోన్లను డబుల్చేయాలని చూస్తున్నట్టు సమాచారం.
మూడు జోన్లు ఆరు జోన్లుగా..
హెచ్ఎండీఏ పరిధిలో శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్, మేడ్చల్–1, మేడ్చల్–2 జోన్లు ఉన్నాయి. గతేడాది వరకు నాలుగు జోన్లుగా ఉండగా అధికారులు సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు మేడ్చల్జోన్ను రెండుగా విభజించారు. రెండు జోన్లకు ఒకరు చొప్పున ఇద్దరు డైరెక్టర్లు, ఐదు జోన్ల పరిధిలో ప్లానింగ్ఆఫీసర్లు(పీఓ), అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్లు(ఏపీఓ)లు కలిపి 25 మంది పని చేస్తున్నారు. వీరితో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలో రియల్ జోరు పుంజుకోవడంతో హెచ్ఎండీఏకు హైరైజ్ బిల్డింగులు, లేఅవుట్స్, కొత్త వెంచర్ల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి.
ఉన్న స్టాఫ్‌తో ఫీల్డ్లెవెల్లో దరఖాస్తులను పరిశీలించి పర్మిషన్ఇవ్వడానికి చాలా టైం పడుతోంది. ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. సత్వరం అనుమతులిచ్చేందుకు, సిబ్బంది పనిభారం తగ్గించేందుకు ప్లానింగ్ విభాగాన్ని విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. చాలా కాలంగా జోన్ల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ఉంది. మేడ్చల్మాదిరిగా మిగిలిన మూడు జోన్లను రెట్టింపు చేస్తే దరఖాస్తుల అనుమతులు మరింత వేగంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, అడ్మినిస్ట్రేషన్ఈజీ అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జోన్ల సంఖ్య పెంచితే మరో ఇద్దరు లేదా నలుగురు డైరెక్టర్లు, 25 మంది వరకూ పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బంది అవసరమవుతారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో జోన్ల సంఖ్య పెంపుపై చర్చించినట్టు తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.