
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం
- మంచిర్యాల జిల్లా చాకెపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
ఆసిఫాబాద్/కాగజ్ నగర్/బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క అన్నారు. మారుమూల పల్లెలన్నింటికీ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొమరవెల్లి నుంచి కిష్టాపూర్ వరకు రూ.2 కోట్లతో బీటీ రోడ్డు, ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకెపల్లి (రాళ్లపేట)లో ఐటీడీఏ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ.44 కోట్లతో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. గత పదేండ్లల్లో నిర్వీర్యమైన ఐటీడీఏలకు పూర్వవైభవం తెచ్చేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఆసిఫాబాద్లో ఐటీడీఏ సబ్ సెంటర్ ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే చాయ్ వాలా మోదీ ప్రధానమంత్రి అయ్యారని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పుడు అదే మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. ఆ కుట్రను ప్రజలే ఎదుర్కోవాలని కోరారు.
ప్రజలంతా అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి: ఎంపీ వంశీకృష్ణ
బుద్ధ పౌర్ణమి నాడు చాకెపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అంబేద్కర్‌ను హోంమంత్రి అమిత్ షా అవమానించారని, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించి గుణపాఠం చెప్పామన్నారు. మంచిర్యాలలో నిర్మిస్తున్న నేతకాని భవనానికి ఎంపీ ఫండ్స్ నుంచి రూ. 50 లక్షలు కేటాయించినట్లు వంశీకృష్ణ వెల్లడించారు.
సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని పార్లమెంట్‌లో కోరానని, ఇందులో భాగంగానే టన్ను బొగ్గుపై అదనంగా రూ.20 వసూలు చేసేందుకు సింగరేణి అంగీకరించిందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేశ్ ధోత్రే పాల్గొన్నారు.