అక్రమ మద్యాన్ని ప్రోత్సాహిస్తున్న సర్కార్

అక్రమ మద్యాన్ని ప్రోత్సాహిస్తున్న సర్కార్

పబ్ కల్చర్ కొరకే తెలంగాణా సాధించుకున్నామా ? ఇదేనా కేటీఆర్ చెప్పిన అభివృద్ధి అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని ప్రభుత్వం పోత్సాహిస్తోందని, బెల్టు షాపులతో ప్రభుత్వ ఆదాయం అమాంతం పెరిగిపోతోందన్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఆబ్కారీ శాఖలు దాడులు చేయడం లేదని విమర్శించారు. జూన్ 07వ తేదీ మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విచ్చలవిడి మద్యంతో కనీస విలువలు లేకుండా పోతున్నాయని, పబ్ కల్చర్‌‌తో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేకపోవడంతో పెట్టుబడులు రావడం లేవన్నారు. రూ. 32 వేల కోట్లు కేవలం ఆబ్కారీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని, మద్యాన్ని ప్రోత్సాహించడం ద్వారా.. 90 శాతం ప్రమాదాలు జరుగుతునట్లు తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లతో కూడా ఆదాయం సమకూరుతోందని, అక్రమ మద్యాన్ని ప్రోత్సాహిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. గంజాయి, బెల్టు షాపులు లేని ఊరు లేదని, మద్యపాన నిషేదంతోనే పల్లె ప్రగతి సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు.. జగిత్యాలలో ఇసుక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. నిర్మాణ రంగంలో ఇసుకను అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కానీ..అలా జరగడం లేదన్నారు. ఇసుక దొరక్కపోవడంతో జగిత్యాల జిల్లాలో నిర్మాణాలు ఆగిపోయినట్లు, ఇల్లు కట్టుకోవడానికి సామాన్య  ప్రజలు ట్రాక్టర్ లలో ఇసుకను తీసుకెళుతుంటే.. పోలీసులు అడ్డుకోవడం శోచనీయమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.