ముగిసిన ప్రజాపాలన.. మొత్తం అప్లికేషన్లు ఎన్ని వచ్చాయంటే..?

ముగిసిన ప్రజాపాలన.. మొత్తం అప్లికేషన్లు ఎన్ని వచ్చాయంటే..?

తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. గత నెల 28 నుంచి నేటి వరకు అన్నీ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజల వద్ద నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. . ఆరు గ్యారెంటీ స్కీమ్ల కోసం లబ్ధిదారులు పెద్ద ఎత్తున అప్లికేషన్లు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపు కోటి 30 లక్షల 94 వేల అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. వీటిలో ఎక్కువగా గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లకే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అప్లికేషన్ల స్వీకరణ ముగియడంతో సోమవారం నుండి దరఖాస్తుల డేటా ఎంట్రీ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.మహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక సాప్ట్ వేర్‌లోకి అప్ లోడ్ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రక్రియను ఈనెల 17న పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డాటా ప్రాసెసింగ్ పూర్తి అయిన అనంతరం ఆరు గ్యారెంటీల్లోని స్కీమ్‌ల లబ్దిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

గడువు ముగిసినా దరఖాస్తులు ఇవ్వొచ్చు

గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసినా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం.. రేపటి (జనవరి8) నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో అధికారులే గ్రామాలు, వార్డులలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు నోడల్ అధికారులను నియమించింది. ఇకపై గ్రామసభల్లో కాకుండా మండల కార్యాలయాల్లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు అప్లికేషన్లు చేయని వారు ఎవరూ అందోళన చెందవద్దని దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.