
- హ్యామ్ విధానంలో నిర్మాణం
- 5,566 కిలోమీటర్ల మేర 400 రోడ్ల గుర్తింపు
- రూ.300 కోట్లకు ఒక ప్యాకేజీ చొప్పున పనుల విభజన
- 16న కేబినెట్ మీటింగ్ కోసం ఫైల్ సిద్ధం
- ఆమోదించగానే టెండర్లకు ఆర్ అండ్ బీ ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దెబ్బతిన్న ఆర్ అండ్‌బీ రోడ్ల పునరుద్ధరణకు సర్కారు సిద్ధమైంది. హ్యామ్ విధానంలో ఒకే సారి 18 సర్కిళ్లలో రూ.10,547 కోట్లతో 5,566 కి.మీ రోడ్లను బాగు చేసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్అండ్బీ అధికారులు 400 రోడ్లను గుర్తించారు. రూ.300 కోట్ల చొప్పున ప్యాకేజీలుగా విభజించి, టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 16న సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరుగనున్న కేబినెట్ మీటింగ్‌లో చర్చించేందుకు వీలుగా ఫైల్స్ రెడీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో గల18 సర్కిళ్ల ద్వారా 5,566 కి.మీ పొడవున గల 400 రోడ్లను బాగు చేయనున్నారు. ఇందులో 122.6 కి.మీ దూరం నాలుగు లైన్లు, 866.4 కి.మీ దూరం రెండు లైన్లు, 778.86 కి.మీ పది మీటర్ల రోడ్లు కొత్తగా నిర్మించనున్నారు. అలాగే 3,775 కి.మీ దూరం రోడ్లను రిపేర్ చేసి బాగు చేయడానికి డీపీఆర్ రెడీ చేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్లు వేయాలని, అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాల మధ్య కనెక్టివిటీ కారిడార్లుగా హ్యామ్ రోడ్లు నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు.
సంగారెడ్డి సర్కిల్ పరిధిలో అత్యధికంగా రూ.925.3 కోట్లు, హనుమకొండ పరిధిలో రూ.815.3 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఖమ్మం రెండో డివిజనల్ పరిధిలో అత్యల్పంగా 13 కి.మీ దూరం గల ఒక రోడ్డు మీదనే రూ.193.5 కోట్లు ఖర్చు చేయనున్నారు.
అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద రూ.1,050 కోట్ల చెల్లింపు
హ్యామ్ రోడ్ల పనులకు సంబంధించి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద రూ.1,050 కోట్లు చెల్లించనున్నది. ఆర్ అండ్ బీ శాఖ తరఫున కాంట్రాక్టర్లు రెండున్నరేండ్ల గడువులో ఈ పనులు కంప్లీట్ చేసేలా ఒప్పందం చేసుకుంటారు. పనులు పూర్తికాగానే 30 శాతం నిధులు రూ.3,150 కోట్లు చెల్లిస్తారు. ఆ తర్వాత 15 ఏండ్లు విడుతల వారీగా నిధులు కేటాయించేలా హ్యామ్ విధానంలో ఒప్పందం చేసుకుంటారు. దీనికి అంగీకరించిన కాంట్రాక్ట్ సంస్థలు మాత్రమే టెండర్ ప్రాసెస్‌లో పాల్గొంటాయి.
ఫైల్ రెడీ చేసిన ఆర్ అండ్ బీ
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 16న జరగనున్న మంత్రుల కేబినెట్ సమావేశంలో చర్చించడానికి హ్యామ్ రోడ్ల ఫైల్ రెడీ చేసినట్లు ఆర్ అండ్ బీ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు తెలిపారు. తొలి దశలో రూ.10,547 కోట్లతో 18 సర్కిళ్ల పరిధిలో చేపట్టబోయే 5,566 కి.మీ దూరం గల 400 రోడ్ల పనులకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్( డీపీఆర్) లను ఎల్ఈఏ(లీ) అసోసియేట్స్ సంస్థ రెడీ చేసిందని పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదిస్తే టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్నమని చెప్పారు.
సర్కిల్ వైజ్ వివరాలు
క్ర.సం సర్కిల్ పేరు రోడ్ల సంఖ్య రోడ్ల దూరం
(కి.మీ) నిధులు
(రూ.కోట్లలో)
1 ఆదిలాబాద్ 18 313.1 571.7
2 భద్రాద్రి కొత్తగూడెం 10 266 380.9
3 హనుమకొండ 45 445.9 815.3
4 జగిత్యాల 27 335.4 524.9
5 భూపాలపల్లి 10 194.2 249.3
6 కరీంనగర్ 21 281 442
7 మహబూబ్ నగర్ 27 381 760.7
8 మంచిర్యాల 12 259.2 523.2
9 నిజామాబాద్ 25 364.8 571
10 హైదరాబాద్ రూరల్ 31 342.1 785.7
11 సంగారెడ్డి 27 418.8 925.3
12 సిద్దిపేట 25 289 392.8
13 వనపర్తి 19 321.5 643.1
14 యాదాద్రి భువనగిరి 16 283.9 607
15 ఖమ్మం–1 36 401.9 726.3
16 ఖమ్మం–2 01 13 193.5
17 నల్గొండ –1 21 260.1 788.3
18 నల్గొండ-2 29 395 646.2
మొత్తం 400 5,566.15 10,547.38