- 2025–26 నుంచి అమలుకు నిర్ణయం
- ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఎగ్జామ్స్
- సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు:టెన్త్ ఇంటర్నల్ మార్కుల రద్దు విధానాన్ని 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం 2024–25 విద్యాసంవత్సరం నుంచే ఇంటర్నల్ మార్కుల విధానం రద్దు చేస్తున్నామని, మొత్తం వంద మార్కులతో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. అయితే, విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉంది.
ఇప్పటికే దాదాపు 90శాతం సిలబస్ కూడా పూర్తయింది. ఈ క్రమంలో పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావడం, ఎగ్జామినేషన్ ప్యాట్రన్ మార్చడంపై టీచర్లలో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది.అయితే, ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తేయడాన్ని స్వాగతిస్తున్నా.. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సర్కారు.. 2025–26 నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తేస్తున్నట్టు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విద్యా సంవత్సరం థియరీ 80 మార్కులు, ఇంటర్నల్ 20 మార్కుల విధానం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో గ్రేడింగ్ విధానానికి సైతం స్వస్తి చెప్తామని పేర్కొన్నారు. కానీ.. సవరణలు చేపట్టిన ఉత్తర్వుల్లో 80, 20 మార్కుల పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.
టెన్త్ క్వశ్చన్ పేపర్ తయారీపై కసరత్తు
టెన్త్ క్వశ్చన్ పేపర్ల తయారీపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం క్వశ్చన్ పేపర్ల విధానంలో మార్పులు చేయడంతో.. దానికి అనుగుణంగా కొత్తగా పేపర్లు తయారు చేయడంపై ఎస్సీఈఆర్టీ చర్యలు ప్రారంభించింది. శుక్రవారం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, క్వశ్చన్ పేపర్ తయారీ నిపుణులతో వర్క్‌షాప్ నిర్వహించింది. సబ్జెక్టుల వారీగా వంద మార్కుల పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండాలనే దానిపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ ముందుగా సీసీఈ విధానం అమలు చేసి.. తిరిగి వంద మార్కుల క్వొశ్చన్ పేపర్ విధానం కంటిన్యూ చేస్తున్నది. తెలంగాణలోనూ అదే విధానం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. లాంగ్వేజీల్లో 70 మార్కులు థియరీ, 20 మార్కులు బిట్ పేపర్, ఇంగ్లిష్‌కు 60 మార్కులు థియరీ, 40 మార్కులు బిట్ పేపర్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ తదితర సబ్జెక్టులకు 80 మార్కులు థియరీ, 20 మార్కులు ఆబ్జెక్టివ్ టైప్ బిట్ పేపర్లు ఇవ్వాలని ప్రాథమికంగా భావిస్తున్నట్టు సమాచారం. కాగా, ఈ వారంలోపే క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ఇవ్వనున్నట్టు అధికారులు చెప్తున్నారు.