- ఇందిరాగాంధీ జయంతి రోజున అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
- రాష్ట్రవ్యాప్తంగా 64.69 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరలు
- ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు సరఫరా
హైదరాబాద్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల సభ్యులకు అందివ్వనున్న ఇందిరమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో 4.35 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా, మెప్మా పరిధిలో పట్టణ ప్రాంతాల్లో 1.70 లక్షల సంఘాలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64,69,192 మంది మహిళా సంఘాల సభ్యులకు చీరలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలు ఇస్తామని పోయినేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు చీరలు రెడీ చేసి పంపిణీకి సిద్ధం చేశారు. ఇప్పటికే చీరలు అన్ని జిల్లాల గోదాములకు చేరుకున్నాయి. వీటిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో మహిళలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు విడతల్లో తయారీ..
గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. ఇందుకోసం ఒక్కో చీరకు రూ.350 ఖర్చు చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో చీరలు అందించనుంది. ఇందుకోసం ఒక్కో చీరకు రూ.480 ఖర్చు చేస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 131 మ్యాక్స్ సంఘాలకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లతో పాటు కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోనూ తయారు చేస్తున్నారు.
సిరిసిల్లలో ఎక్కువ పవర్‌లూమ్స్ ఉండడంతో అక్కడికే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. మొత్తం 4.24 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమవుతుందని అంచనా వేశారు. మొదటి విడతలో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు, రెండో విడతలో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. 6,900 మంది నేత కార్మికులు చీరల తయారీలో నిమగ్నమయ్యారు. వీరు కొన్ని నెలలుగా చీరలను తయారు చేస్తుండగా.. ఇవి తుది దశకు చేరుకున్నాయి.
స్వయంగా పరిశీలించిన సభ్యులు..
రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు చీరలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. సిరిసిల్లలోని వెంకట్రావునగర్‌లో మరమగ్గాల యూనిట్, గీతానగర్‌లోని ప్రాసెసింగ్ యూనిట్, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములను సందర్శించారు. మరమగ్గాలపై రూపుదిద్దుకుంటున్న చీరలను పరిశీలించారు. చీరల తయారీ విధానాన్ని చూసి, అక్కడి కార్మికులు, యజమానులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
