- భూసేకరణకు తొలి విడతగా రూ.583 కోట్లు మంజూరు
- రిజర్వాయర్ పూర్తైతే
- 4.13 లక్షల ఎకరాలకు సాగునీరు
- త్వరలో భూసేకరణ నోటిఫికేషన్లు
దక్షిణ తెలంగాణ సాగునీటి భవిష్యత్తును నిర్ణయించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు గత బీఆర్ఎస్ సర్కారు పక్కన పెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ కోసం తొలి విడతగా రూ.583 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్లు జారీ చేసి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో ఏండ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
చేవెళ్ల, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. తొలివిడతగా రూ.583 కోట్లు మంజూరు చేసి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఇరిగేషన్, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రిజర్వాయర్, కాలువలకు అవసరమైన భూసేకరణ, పరిహారంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2015 జూన్ 11న పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(పీఆర్ఎల్ఐ)ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కొందుర్గు మండలంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రకటించింది. అయితే పాలమూరు ప్రాంతంలోని ఐదు రిజర్వాయర్ల పనులు ప్రారంభించినా లక్ష్మీదేవిపల్లిని మాత్రం చేపట్టలేదు.
బీఆర్ఎస్ వెనుకడుగు..
2023 మేలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని విరమించుకుంటున్నామని, దీని కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు ఉదండాపూర్ నుంచే కాలువల ద్వారా నీళ్లు అందిస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది. అయితే డీపీఆర్ ప్రకారం 16.3 టీఎంసీల సామర్థ్యమున్న ఉదండాపూర్‌కు 4.88 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 2.80 టీఎంసీల సామర్థ్యం గల లక్ష్మీదేవిపల్లి కింద 4.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
మరి ఒక్క ఉదండాపూర్‌తోనే మొత్తం 9.1 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా అందిస్తారని అప్పట్లో ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. రైతులు కూడా లక్ష్మీదేవిపల్లి నిర్మాణం కోసం ఆందోళనలు చేపట్టారు. కెనాల్స్ వెళ్లే ప్రాంతాల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు భూములు కొనుగోలు చేశారని, అందుకే ప్రాజెక్టును నిలిపేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
అత్యధికంగా చేవెళ్లలో 1.24 లక్షల ఎకరాలకు నీరు..
పీఆర్ఎల్ఐ స్కీం కింద మొత్తం 12.30 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించగా, లక్ష్మీదేవిపల్లి కింద 4.13 లక్షల ఎకరాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చేవెళ్లలో 1,09,539 ఎకరాలు, షాద్‌నగర్‌లో 84,061 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 85,914 ఎకరాలు, మహేశ్వరంలో 19,165 ఎకరాలు, కల్వకుర్తిలో 70,896 ఎకరాలు, పరిగి–కొడంగల్–వికారాబాద్ ప్రాంతాల్లో 43,425 ఎకరాలు ప్రతిపాదించారు.
అయితే ఇరిగేషన్ శాఖ 2026 మే ప్రెజెంటేషన్ ప్రకారం అత్యధికంగా చేవెళ్లలో 1.24 లక్షల ఎకరాలు, కొడంగల్‌లో 1.17 లక్షల ఎకరాలు, పరిగిలో 90 వేల ఎకరాలు, షాద్‌నగర్‌లో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపింది. మిగతా ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించే అవకాశాలు పరిశీలిస్తున్నారు.
సీఎం స్పెషల్ ఇంట్రెస్ట్..
సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ముఖ్యంగా భూసేకరణ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇటీవల మహబూబ్‌నగర్ పర్యటనలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై స్పష్టతనిస్తూ, త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇటీవల ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్‌ను కలిసి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అధికారులు కూడా త్వరలో పనులు మొదలవుతాయని హామీ ఇచ్చారు.
