సర్కారు బడుల్లో..ఫేషియల్ రికగ్నిషన్ సక్సెస్..100 శాతం హాజరు నమోదు

సర్కారు బడుల్లో..ఫేషియల్ రికగ్నిషన్ సక్సెస్..100 శాతం హాజరు నమోదు
  • మొదలైన రెండున్నర నెలల్లోనే గాడిలోకి
  • 99.75 శాతం మంది టీచర్ల రిజిస్ట్రేషన్ పూర్తి
  • బడుల్లో పెరిగిన టీచర్ల అటెండెన్స్

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో పనిచేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బంది అటెండెన్స్ పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్​ఆర్ఎస్) విజయవంతంగా అమలవుతున్నది. ఈ విధానం మొదలైన రెండున్నర నెలల్లోనే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయ్యాయి. ఎఫ్ఆర్ఎస్​తో బడుల్లో టీచర్ల అటెండెన్స్ గణనీయంగా పెరిగిందని స్టూడెంట్లు, పేరెంట్స్ చెబుతున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 24,997 సర్కారు స్కూళ్లుండగా, వీటిలో 1,31,894 టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది. వీరికి ఆగస్టు1 నుంచి ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తున్నారు. తొలిరోజే 90వేలకుపైగా మంది ఎఫ్ఆర్ఎస్ యాప్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారంలోనే దాదాపు ఈ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకూ 1,31,561 మంది రిజిస్ట్రేషన్ పూర్తయింది. 333 మంది టీచర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. 

ఇంకా చేసుకోని వీరంతా వివిధ సెలవుల్లో ఉన్న వారేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ఆర్ఎస్ యాప్ లో అటెండెన్స్, లీవ్స్ ఎంతమంది ఉన్నారనే వివరాలూ తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ను స్కూల్ ఆవరణలోనే వేయాల్సి ఉంటుంది. దీంతో టీచర్లంతా తప్పనిసరిగా బడులకు వెళ్లాలి. 

దీంతో టీచర్ల అటెండెన్స్ గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో బోగస్ అటెండెన్స్ ను కట్టడి చేసినట్టు అయింది. గతంలో కొందరు టీచర్లు స్కూళ్లకు పోకపోయినా.. మరుసటి రోజు అటెండెన్స్ వేసుకునే వాళ్లు. కొందరు టీచర్లు డీఈఓ ఆఫీసుల చుట్టూ, డీఎస్ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతుండే వాళ్లు. కానీ, ఇప్పుడు ఆ పరిసరాల్లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. 

అధికారికంగా 84శాతం టీచర్లు స్కూళ్లకు అటెండ్ అవుతున్నారు. కాగా, టీచర్లు, డీఈవోల మానిటరింగ్ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎస్ విజయవంతంగా అమలు అవుతోందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.