అప్పులు తెచ్చిన తిప్పలు.. ఖజానా ఖాళీ..

అప్పులు తెచ్చిన తిప్పలు.. ఖజానా ఖాళీ..
  • ఖజానా ఖాళీ.. కరోనా టైంలో ఏ సాయం లేదు
  • లాక్​డౌన్​తో నష్టపోయే వారిని ఆదుకునే ప్యాకేజీ లేదు 
  • నిరుడు వద్దన్న ఆయుష్మాన్ భారత్​ పథకమే ఇప్పుడు దిక్కు
  • కరోనాను ఆరోగ్య శ్రీలో చేరిస్తే ఏటా రూ. 3 వేల కోట్ల భారమని వెనకడుగు
  • ఇప్పటికే రాష్ట్ర సర్కారు అప్పులు రూ. 4 లక్షల కోట్లు

హైదరాబాద్​, వెలుగు: కరోనా కష్టకాలంలో ప్రజల ఆరోగ్యానికి ఖర్చు చేయడానికి కూడా రాష్ట్ర ఖజానాలో పైసల్​ లేవ్. రాష్ట్ర ప్రభుత్వం భారీగా  చేసిన అప్పులు, వాటికి కట్టాల్సిన కిస్తీలతో ఇప్పటికే ఖజానా దివాలా తీసింది. దీంతో కరోనా కట్టడికి కూడా తగినన్ని నిధులను  విడుదల చేయలేకపోతోంది. ఆయుష్మాన్​ భారత్​ స్కీం కంటే ఆరోగ్య శ్రీ  స్కీంతో ఎక్కువ ప్రయోజనాలున్నాయని నిరుడు అసెంబ్లీలో చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు ఆయుష్మాన్​ భారత్​లో చేరుతున్నట్లు ప్రకటించటం గమనార్హం. ఈ టైమ్​లో  కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్య శ్రీలో చేరిస్తే ఏడాదికి మరో రూ. 3,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని ఆఫీసర్లు  లెక్కలేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 4 లక్షల కోట్లు  ప్రభుత్వం అప్పులు చేసింది. వీటికి నెలనెలా కట్టాల్సిన మిత్తీలు పేరుకుపోయాయి. ప్రభుత్వం ఇతర బిల్లుల చెల్లింపులను వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేరిస్తే ఆ భారాన్ని భరించే పరిస్థితి లేదని, అందుకే కేంద్ర ప్రభుత్వ స్కీం ఆయుష్మాన్​ భారత్​లో చేరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అధికార వర్గాలు అంటున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లో చేరితే రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నాయి. ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​లో చేరితే రాష్ట్రంలో దాదాపు 29 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. అదే కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్య శ్రీలో చేరిస్తే 79 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​ ఎంపానెల్​ జాబితాలో ఉన్న హాస్పిటళ్లు రాష్ట్రంలో 12 మాత్రమే ఉన్నాయి. ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్నవి 337 హాస్పిటళ్లు. వీటన్నింటా ఫ్రీ ట్రీట్​మెంట్​ అందించగలిగితేనే.. లక్షలాది కుటుంబాలకు బెనిఫిట్​గా ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్య శ్రీలో చేర్చకపోవడానికి ఆర్థిక పరిస్థితులే కారణమని అధికారులు చెప్తున్నారు.

హాస్పిటళ్లకు రూ. 1,200 కోట్లు బాకీ
ఏడు నెలలుగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు  హాస్పిటళ్లకు దాదాపు రూ. 1,200 కోట్లు బకాయి పడింది. సరిపడే నిధుల్లేక పోవటంతో ఈ బిల్లుల చెల్లింపును వాయిదా వేసుకుంటూ వస్తోంది. నెల రోజులుగా రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లు కరోనా పేషెంట్లతో కిక్కిరిసి ఉన్నాయి. ప్రస్తుతం 70 శాతం మంది కరోనా పేషెంట్లు ప్రైవేటు హాస్పిటళ్లలోనే  ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ టైమ్​లో  కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్య శ్రీలో చేరిస్తే ఏడాదికి మరో రూ. 3,000 కోట్లకు పైగా భారం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అందుకే ఆర్థిక పరిమితుల దృష్ట్యా సర్కారు వెనక్కి తగ్గిందని వారు అంటున్నారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు పొరుగు రాష్ట్రాలన్నీ కరోనాకు ఫ్రీ ట్రీట్​మెంట్​ అందించే ఏర్పాట్లు చేశాయి. కానీ ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఆ వూపుగా ఆలోచన చేయకుండానే నెట్టుకొచ్చింది. ఇన్నాళ్లూ అటు ఆయుష్మాన్​ భారత్​ స్కీంలో  చేరకపోగా.. ఇటు  కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చకుండా పెండింగ్​లో పెట్టింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆయుష్మాన్​ భారత్​లో చేరుతున్నట్లు ప్రకటించింది.

అన్నిటికీ కటకట
ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం ఇంచుమించుగా రూ.  4 లక్షల కోట్లయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే నెలనెలా జీతాలకు కూడా ఇబ్బందికర పరిస్థితి వెంటాడుతోంది. ఏప్రిల్​లోనే రూ. 8 వేల కోట్ల రుణం కావాలని రాష్ట్ర సర్కార్​ ఆర్​బీఐని కోరింది. గడిచిన రెండు నెలల్లో రూ. 5 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఈ నెలాఖరుకు మరో రూ. 1,500 కోట్ల కోసం బాండ్లను వేలం వేయనుంది. అటు అప్పులు, ఇటు వాటికి కట్టాల్సిన కిస్తీల ఫలితంగా ప్రభుత్వ స్కీమ్​లన్నింటికీ నిధుల కొరత మొదలైంది. జూన్​లో రైతుల ఖాతాల్లో వేయాల్సిన రైతు బంధుకు దాదాపు రూ. 7,500 కోట్లు కావాలి. లాక్​డౌన్​ కారణంగా రైతుబంధు నిధులు మరింత లేటవుతాయని, ఇప్పటికే ప్రకటించిన పీఆర్​సీ జీతాలను ఎప్పటి నుంచి చెల్లిస్తారనేది స్పష్టత లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

విడతల వారీగా లాక్​డౌన్ ​అందుకే
ఏడాది నుంచి కరోనా వైరస్ రాష్ట్రంలో వేలాది కుటుంబాలను అప్పుల పాల్జేసింది. వీరిని ఆదుకునేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేయాల్సిన టైమ్​లో సర్కారు సైలెంట్​గా ఉండిపోయింది.  ఇప్పుడు సెకండ్​ వేవ్​ మొదలైనప్పటి నుంచి కూడా ఏ ఒక్క వర్గాన్నీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లాక్​డౌన్​ను 20 రోజులు అని ఒకేసారి ప్రకటిస్తే.. సాయం కోసం వివిధ వర్గాల నుంచి డిమాండ్లు పెరుగుతాయన్న ఆలోచనతోనే రెండు విడతలుగా ప్రకటించినట్లు విమర్శలు వస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్​తో, లాక్​డౌన్​ వల్ల చాలా మంది ఉపాధి లేక ఆగమవుతున్నారు. తిండికి కూడా తిప్పలు పడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రజలు మొర పెట్టుకుంటున్నా.. ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోనట్లుగా వ్యవహరించడం వెనుక అసలు కారణం నిధుల కటకటేనని స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఆరోగ్య శ్రీతో పాటు ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​ను కలిపి అమలు చేసి కరోనా పేషెంట్లకు ఫ్రీ ట్రీట్ మెంట్​ అందిస్తోంది. కరోనా వల్ల చనిపోయినవారి అంత్యక్రియలకు రూ. 15వేల  సాయం కూడా అందజేస్తోంది. ఈ మహమ్మారి వల్ల అనాథలైన పిల్లలకు సాయం చేస్తోంది. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలోనూ అక్కడి ప్రభుత్వాలు మెరుగైన సేవలు, స్కీమ్​లు అమల్లోకి తెచ్చాయి.