
- 5 వేల లైసెన్స్‌డ్ సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తున్నం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: భూభారతితో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కచ్చితమైన భూరికార్డులను రూపొందించడానికి ప్రభుత్వం పనిచేస్తున్నదని
తెలిపా రు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పోస్టుల భర్తీకి 10,031 వేల దరఖాస్తులు వచ్చాయని సోమవారం రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 5 వేల లైసెన్స్‌డ్ సర్వేయర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 26 నుంచి గచ్చిబౌలిలోని సర్వే ట్రైనింగ్ అకాడమీలో 2 నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జత చేయడం తప్పనిసరి చేశామని తెలి పారు.
ఈ విధానాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొచ్చేందుకు పెద్ద సంఖ్యలో సర్వేయర్ల అవసరాన్ని గుర్తించినట్లు చెప్పారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. టీజీఆర్ఏసీ (తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్) ద్వారా సర్వే రికా ర్డులను (మ్యాపులు) డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. ప్రయోగాత్మకంగా నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండ లంలోని లింగాల గ్రామం, జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తక్కలపల్లి, ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పెద్దకోరుకొండి గ్రామాల్లో ఈ ప్రక్రియను 2 రోజుల్లో ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. ఈ డిజిటల్ మ్యాప్ లను ఎక్కడి నుంచైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. మ్యానువల్ పద్ధతుల కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో కచ్చితమైన సమాచారం పొందొచ్చని పేర్కొన్నారు.