- గ్రీన్ ఫార్మా సిటీ కోసం ఉన్న డెఫినేషన్‌ను ‘ఆల్టర్‌నేటివ్ అండ్ హయ్యర్ పబ్లిక్ పర్పస్’గా మార్చాలని నిర్ణయం
- భూసేకరణ చట్టంలోని సెక్షన్ల ప్రకారం నిబంధనల సవరణకు సర్కారు కసరత్తు
- త్వరలో కేబినెట్‌లో పాలసీకి ఆమోదం.. హైకోర్టులో కొత్త అఫిడవిట్ దాఖలు
- పెట్టుబడిదారుల అభద్రతాభావాన్ని తొలగించేలా ‘సేల్ డీడ్ ఇండెమ్నిటీ పాలసీ’
- గ్రీన్ ఫార్మా, లైఫ్ సైన్సెస్‌తోపాటు ఇతర పబ్లిక్ అవసరాలకు ఫ్యూచర్ సిటీ ల్యాండ్ యుటిలైజేషన్
- 7 మండలాలు, 56 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును చట్టపరమైన వివాదాల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ మెగా ప్రాజెక్టును ఏకపక్షంగా రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి వీలు లేకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నూటికి నూరు శాతం భరోసా కల్పించేలా పక్కా లీగల్ ఇమ్యూనిటీ కల్పించేలా కసరత్తు మొదలుపెట్టింది.
అందులో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముచ్చర్ల పరిసరాల్లో సేకరించిన వేల ఎకరాల భూమి కేవలం ‘గ్రీన్ ఫార్మా సిటీ కోసం ’ అనే నిబంధనను సవరిస్తూ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం దీనిని ఎకో ఫ్రెండ్లీ మల్టీపర్పస్ మెగా ప్రాజెక్టు కింద ‘ఆల్టర్‌నేటివ్ అండ్ హయ్యర్ పబ్లిక్ పర్పస్’గా మార్చనున్నారు. కేబినెట్ భేటీలో ఈ మార్పులకు ఆమోద ముద్ర వేసి, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కేసులకు సంబంధించి ప్రభుత్వం తరఫున సరికొత్తగా సవరించిన అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.
7 మండలాలు, 56 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల్లో విస్తరించనున్న ఈ మహానగరంలో వందల కోట్లు పెట్టే అంతర్జాతీయ సంస్థలకు ‘సేల్ డీడ్ ఇండెమ్నిటీ పాలసీ’ ద్వారా శాశ్వత యాజమాన్య హక్కులను బదిలీ చేయనుండటంతో పాటు ఫ్యూచర్ సిటీ ల్యాండ్ యుటిలైజేషన్ పాలసీ తీసుకురానుంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ ద్వారా మౌలిక వసతుల పనులను వేగవంతం చేశారు.
చిక్కుముడులు లేకుండా
గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లాలోని కందుకూర్, యాచారం, కడ్తాల్ తదితర మండలాల పరిధిలో వేలాది ఎకరాల పట్టా, అసైన్డ్ భూములను సేకరించిన సమయంలో.. ఈ భూములను కేవలం ఫార్మా సిటీ అవసరాల కోసమే వాడుతామని, మరే ఇతర అవసరాలకు వాడబోమని అప్పట్లో ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వక హామీ (అఫిడవిట్) ఇచ్చింది.
అయితే పాత అఫిడవిట్‌ను ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు, కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి మునుపటి ప్రభుత్వాల మెగా ప్రాజెక్టులు (గతంలో ఏపీలో అమరావతి తరహాలో) నిలిచిపోతాయేమోనని అంతర్జాతీయ కంపెనీల్లో వ్యక్తమవుతున్న అభద్రతాభావాన్ని తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చిక్కుముడిని విప్పేందుకు సిద్ధమైంది. సేకరించిన భూమి పర్పస్ (ఉద్దేశాన్ని) మార్చడం ద్వారానే ఇన్వెస్టర్లలో నమ్మకం కల్పించవచ్చని ప్రభుత్వానికి ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ లీగల్ టీమ్ నివేదించినట్టు తెలిసింది.
ప్రస్తుతం అక్కడ కాలుష్య రహిత ఏఐ సిటీ, హెల్త్ సిటీ, అమెజాన్‌లాంటి సంస్థల భాగస్వామ్యంతో గ్లోబల్ డేటా సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, సింగరేణి కాలరీస్ కొత్త ప్రధాన కార్యాలయం, తోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 50 ఎకరాల్లో లెదర్ స్కిల్ యూనివర్సిటీలాంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భవన సముదాయాలు ఇక్కడ ప్లాన్ చేస్తున్నది.
కాలుష్యరహిత పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ... డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్, హెటిరో, అరబిందో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్‌లాంటి దిగ్గజ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయస్థాయి లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించడానికి ఉప్పల్ స్టేడియం కంటే భారీ సీటింగ్ సామర్థ్యంతో సరికొత్త ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఇతర వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ అకాడమీలను ప్లాన్ చేశారు.
ఫార్మా టు ఫ్యూచర్ సిటీ.. ప్రభుత్వానిదే విచక్షణాధికారం
గతంలో ఫార్మా సిటీ కోసం భూముల సేకరణ 2015 లో మొదలైనప్పటికీ, మెజారిటీ భూముల ఫైనల్ అవార్డులు పూర్తిస్థాయి స్వాధీనం 2019, 2021, 2023లో జరిగింది. ఈ భూవినియోగ మార్పిడి కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్సపరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్-2013’ లోని కీలక సెక్షన్లను రాష్ట్ర సర్కారు ఎంచుకున్నది. 2013 చట్టంలోని సెక్షన్ 2(1), సెక్షన్ 3(జడ్) ప్రకారం.. పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, విద్యాసంస్థలు, ఉపాధి కల్పించే ఏ ప్రాజెక్టైనా ‘ప్రజా ప్రయోజనం’ (పబ్లిక్ పర్పస్ ) కిందికే వస్తుంది.
అలాగే, కేంద్ర చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం సేకరించిన భూమిని 5 ఏండ్లలో వాడకపోతే తిరిగి ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ.. దానికి సవరణ చేస్తూ తెచ్చిన ‘తెలంగాణ భూసేకరణ సవరణ చట్టం–-2016’ లోని నిబంధనల ప్రకారం, ప్రాజెక్ట్ గడువు ముగిసేవరకు లేదా ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితి ముగిసేవరకు భూమిని ల్యాండ్ బ్యాంక్‌లోనే ఉంచుకోవచ్చు. దీని ప్రకారం, ఫార్మా సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ పబ్లిక్ పర్పస్ ల్యాండ్ గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధమైన విచక్షణాధికారాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని ల్యాండ్‌మార్క్ తీర్పులను కూడా ప్రభుత్వం హైకోర్టు అఫిడవిట్‌లో ప్రస్తావించనున్నది. స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎమ్. భాస్కరన్ పిళ్ళై, మహేశ్వర్ నారాయణ్ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ‘‘ఒకసారి భూసేకరణ ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తయి, పరిహారం చెల్లించాక ఆ భూమిపై పాత యజమానులకు హక్కులు ఉండవు.
ప్రభుత్వం ఒక ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని, కాలక్రమేణా మారిన పరిస్థితుల దృష్ట్యా అంతకంటే మెరుగైన లేదా ప్రత్యామ్నాయ ప్రజా ప్రయోజనం కోసం వాడుకునే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుల ఆధారంగానే, ఫార్మా సిటీ కంటే ఫ్యూచర్ సిటీ ద్వారా రాష్ట్రానికి మెరుగైన ఆర్థిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని కోర్టుకు వివరించనున్నారు.
ఇన్వెస్టర్లకు నేరుగా యాజమాన్య హక్కులు
ఇక ఫ్యూచర్ సిటీలోకి అడుగుపెట్టే గ్లోబల్ ఇన్వెస్టర్లకు భూములను కేవలం లీజు ప్రాతిపదికన కాకుండా, నేరుగా యాజమాన్య హక్కులను బదిలీ చేసేలా ‘రిజిస్టర్డ్ సేల్ డీడ్’ రూపంలో శాశ్వతంగా కేటాయించనుంది. ఈ సేల్ డీడ్స్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఇండెమ్నిటీ క్లాజ్’ (నష్టపరిహార పూచీకత్తు) చేర్చనుంది.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 లో ఈ భూములకు సంబంధించిన ల్యాండ్ యూజ్ జోనింగ్‌ను ఫార్మా జోన్ నుంచి మల్టీ పర్సప్, ఐటీ అండ్ కమర్షియల్ జోన్‌గా మార్చే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది.
నేరుగా యాజమాన్య హక్కులు బదిలీ
ఇక ఫ్యూచర్ సిటీలోకి అడుగుపెట్టే గ్లోబల్ ఇన్వెస్టర్లకు భూములను కేవలం లీజు ప్రాతిపదికన కాకుండా, నేరుగా యాజమాన్య హక్కులను బదిలీ చేసేలా ‘రిజిస్టర్డ్ సేల్ డీడ్’ రూపంలో శాశ్వతంగా కేటాయించనున్నారు. ఈ సేల్ డీడ్స్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఇండెమ్నిటీ క్లాజ్’ (నష్టపరిహార పూచీకత్తు) చేర్చడం ద్వారా, భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వమైనా లేదా కోర్టు కేసుల వల్లనైనా కంపెనీలకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వనున్నారు.
‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్’ ప్రకారం ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తదుపరి వచ్చే ప్రభుత్వం ఏకపక్షంగా ఆ హక్కులను రద్దు చేయడం సాధ్యం కాదు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-–2050 లో ఈ భూములకు సంబంధించిన ల్యాండ్ యూజ్ జోనింగ్‌ను ఫార్మా జోన్ నుంచి మల్టీ పర్సప్, ఐటీ అండ్ కమర్షియల్ జోన్‌గా మార్చే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా నడుస్తోంది.
అయితే, గతంలో తక్కువ పరిహారం పొంది అన్యాయానికి గురయ్యామని భావిస్తున్న స్థానిక రైతులకు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేసిన ప్లాట్లను కేటాయించడం లేదా అదనపు ప్యాకేజీని ప్రకటించడం ద్వారా లీగల్ పొలిటికల్ వివాదాలు రెండింటికీ ఒకేసారి ఫుల్‌స్టాప్ పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
