
- సీనియర్ టీచర్లతో కమిటీలు
- రాష్ట్రవ్యాప్తంగా 300 టీమ్స్
- ఈ నెలాఖరు నుంచే ఇన్‌స్పెక్షన్ షురూ
- లోపాలుంటే అక్కడికక్కడే సరిదిద్దేలా చర్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యా ప్రమాణాలు, బోధనలో క్వాలిటీ మెరుగుపర్చేందుకు గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీతో పాటు హైస్కూళ్లలో అకడమిక్ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో సీనియర్ టీచర్లతో ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. కొత్త టీమ్స్‌తో ఈ నెలాఖరు నుంచే స్కూళ్లలో తనిఖీలు ప్రారంభించేలా చర్యలు ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా 16,474 ప్రైమరీ, 3,100 అప్పర్ ప్రైమరీ, 4,672 హైస్కూళ్లు ఉన్నాయి. ఇదివరకు ఒక్క టీచర్‌తోనే కమిటీలు వేశారు. దీంతో తనిఖీలు సరిగా జరగలేదు. ఇక హైస్కూళ్లలో కేవలం ఒకే స్కూల్ అసిస్టెంట్ఇన్స్పెక్షన్ చేయాలని ఆదేశించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ అధికారులు కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి జిల్లాలో స్కూళ్ల సంఖ్యను బట్టి ప్రైమరీ, యూపీఎస్, హైస్కూళ్లకు తనిఖీ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీమ్‌లు ప్రతి మూడు నెలల్లో వంద స్కూళ్లను తనిఖీ చేయాల్సి ఉంది. హైస్కూళ్ల కోసం వేసిన కమిటీలు 50 స్కూళ్లను తనిఖీ చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రైమరీ స్కూళ్ల కోసం 168 టీమ్‌లు, యూపీఎస్‌ల కోసం 35, హైస్కూళ్ల కోసం 96 టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయి. ఈ సందర్భంగా టీచర్లు క్లాసులు ఎలా చెప్తున్నారనేది ప్రధానంగా పరిశీలించనున్నారు.
టీచర్లు క్లాసులు చెప్తుండగా.. కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా విననున్నారు. కాగా, హైస్కూల్టీమ్లు ఒకరోజు ఒక స్కూల్‌నే తనిఖీ చేయనుండగా.. మిగిలిన టీమ్స్ రెండేసి చొప్పున స్కూళ్లలో తనిఖీలు చేపట్టనున్నాయి. ఈ సందర్భంగా గమనించిన లోపాలను అదే రోజు ఆ టీచర్లకు వివరించి, సరిదిద్దుకునేలా సూచనలు చేయనున్నారు. తనిఖీ నివేదికలను ఆన్ లైన్ పోర్టల్‌లో అప్డేట్ చేస్తారు.
కమిటీలు ఇలా..
జిల్లాల్లోని స్కూళ్ల సంఖ్య ఆధారంగా టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రైమరీ స్కూల్ ఇన్‌స్పెక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు. నోడల్ ఆఫీసర్‌గా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ తో పాటు ఇద్దరు ఎస్జీటీలు ఉంటారు. యూపీఎస్తనిఖీ టీమ్స్‌లో స్కూల్ అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్‌గా, పీఎస్‌హెచ్ఎం, ఎస్జీటీలు సభ్యులుగా ఉంటారు. హైస్కూల్ ఇన్‌స్పెక్షన్ టీమ్‌లలో మొత్తం 9 మంది ఉండనున్నారు. జీహెచ్ఎం నోడల్ ఆఫీసర్‌గా, ఏడుగురు సబ్జెక్టు టీచర్లు, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీడీ) సభ్యులుగా ఉంటారు. తనిఖీ అధికారులకు కనీసం పదేండ్ల అనుభవం, సబ్జెక్టులో నైపుణ్యంతో పాటు ఇన్ సర్వీస్ ట్రైనింగ్‌లో పాల్గొన్న అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ కమిటీలను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే కమిటీ ద్వారా నియమించనున్నారు. దీంట్లో ఎంపికైన టీచర్లంతా పూర్తిస్థాయిలో తనిఖీలకే అంకితమవుతారు. ప్రస్తుతం వాళ్లు పనిచేస్తున్న బడుల్లో ఇతరులను నియమించి, అక్కడి పిల్లలకు క్లాసులు చెప్పించనున్నారు. ఈ కమిటీలన్నీ ఈ అకడమిక్ ఇయర్‌కే పరిమితం కానున్నాయి.