- అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్లతో పాటు ఇతర ఎక్విప్మెంట్ను కొనుగోలు చేయబోతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం 1,770 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు.
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రూ.58 కోట్లతో కొత్తగా 485 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిని ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. నిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 15 కొత్త వెంటిలేటర్లు మరి కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
జిల్లా హాస్పిటల్స్ లోనూ ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్..
ఇప్పటివరకు గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్, ఎంజీఎం వరంగల్ లో మాత్రమే ఎంఆర్‌ఐ సౌకర్యం ఉందని, ఈ పరిస్థితిని మారుస్తూ రూ.192 కోట్లతో కొత్తగా 8 ఎంఆర్‌ఐ మిషన్లను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. వీటిని మహబూబ్ నగర్, సూర్యాపేట, నిజామాబాద్, నల్గొండ, సిద్దిపేట, నీలోఫర్ హాస్పిటల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
వీటితో పాటు ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ లో రద్దీని తట్టుకునేందుకు అక్కడ అదనపు మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ మార్చి 2026 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే.. రూ.60 కోట్లతో 8 కొత్త సీటీ స్కాన్ మెషీన్లు కూడా మార్చి 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
బస్తీ దవాఖాన్లలో మందుల కొరత లేకుండా..
బస్తీ దవాఖానలకు ఇకపై పీహెచ్‌సీల ద్వారా కాకుండా నేరుగా సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ (సీఎంఎస్)ల నుంచే మందులు సరఫరా చేయనున్నట్లు దామోదర తెలిపారు. ఎమర్జెన్సీ సేవల కోసం గతేడాది 213 అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చామని, దీంతో రెస్పాన్స్ టైమ్ 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గిందని, కొత్తగా వచ్చే 79 అంబులెన్సులతో ఇది 10 నిమిషాలకు తగ్గుతుందన్నారు. నిమ్స్‌లో రూ.32 కోట్లతో కొత్త లినాక్ మెషీన్, 8 కోట్లతో బ్రాకీథెరపీ మెషీన్లను మార్చి నాటికి సమకూర్చనున్నట్లు వెల్లడించారు.
ఎర్త్ సైన్స్ వర్సిటీకి రూ.500 కోట్లు కేటాయిస్తం
కొత్తగూడెం ప్రాంతాన్ని ఎడ్యుకేషన్‌హబ్‌గా మార్చే లక్ష్యంతో నిరుడు డిసెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వచ్చే రెండేండ్లలో వర్సిటీకి రూ.500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. వర్సిటీ విస్తరణ కోసం 310 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. సోమవారం ‘తెలంగాణ యూనివర్సిటీల చట్టం 1991’ సవరణ బిల్లును సీఎం రేవంత్ తరఫున దామోదర సభలో ప్రవేశపెట్టారు.
బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1978లో స్థాపించిన కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ను నిరుడు ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీగా మార్చామని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును వర్సిటీకి పెట్టి నివాళి అర్పించామన్నారు.
