- విద్యకు తెలంగాణ సర్కారు ప్రయారిటీ..
- విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేస్తారనే భావిస్తున్నం
- ..అట్లయితే బీజేపోళ్లు కూడా అర్బన్ నక్సల్సే
- ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఉండొద్దు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం
- గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచర్స్‌కు అకౌంటబిలిటీ ఉండాల్సిందేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: విద్యా ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, తెలంగాణ విద్యా కమిషన్ సభ్యురాలు, ఫ్రొఫెసర్ శాంతా సిన్హా తెలిపారు. రాష్ట్రంలో విద్యా విధానం ఎట్లా ఉండాలనే అంశంపై విద్యా కమిషన్ ఏర్పాటు చేసి.. పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు. కమిషన్ చేసిన సిఫారసులను సైతం ప్రభుత్వం అమలు చేస్తుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. విద్య కోసం ప్రతీయేటా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని.. అయినా ప్రైవేట్ స్కూల్ ఫీజుల కోసం పేరెంట్స్ అప్పులు చేస్తున్నారని అన్నారు. దీనిని మార్చాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ఒక్కటే పరిష్కారం అని తెలిపారు.
‘‘రాష్ట్రంలో పేద ప్రజలు, బడి పిల్లల కోసం ఆలోచిస్తే అర్బన్ నక్సల్స్ ముద్ర వేస్తారా? అట్లయితే బీజేపోళ్లు కూడా అర్బన్ నక్సల్సే” అని ఫైర్ అయ్యారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో పనిచేసే టీచర్లకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని.. యూనివర్సిటీల్లో దీనిని ఎన్నో ఏండ్లుగా అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ విద్యా విధానంపై విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై ‘వీ6 వెలుగు’ ఇన్నర్ వ్యూలో ఫ్రొఫెసర్ శాంత సిన్హాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
విద్యా కమిషన్ సిఫారసులపై పెద్ద దుమారం రేగింది? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
విద్యా కమిషన్ సభ్యులు ఏసీ రూమ్‌లలో కూర్చొని నివేదిక తయారు చేయలేదు. మొత్తం 33 జిల్లాల్లోని అనేక గవర్నమెంట్ స్కూల్స్ తిరిగినం. టీచర్స్, పేరేంట్స్, యూత్, అక్కడి పొలిటికల్ పార్టీల లీడర్లతో మాట్లాడి వివరాలు సేకరించినం. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నం. ఎక్కడ చూసినా ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య చాలా తక్కువగా కనిపించింది. డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. నాలుగైదు క్లాస్‌లకు ఒక్కరే టీచర్ ఉన్నారు. టాయిలెట్స్ లేవు.. ఇలా అనేక రకాల సమస్యలు గుర్తించినం. 77 శాతం మంది పిల్లలు ప్రభుత్వ బడులకు దూరంగా ఉన్నారు. సమాజానికి తెలియకుండానే రాష్ట్రంలో విద్యా ప్రైవేటీకరణ జరుగుతున్నది. వీటిని గుర్తించిన కమిషన్ రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యమైన 5 రకాల పాయింట్స్‌పై సిఫారసులు చేసింది.
ప్రభుత్వ సూళ్లపై పేరెంట్స్‌కు నమ్మకం ఎందుకు పోయింది..?
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక స్కూల్‌లో, 6 నుంచి పదో తరగతి వరకు ఇంకో స్కూల్‌లో, ఇంటర్మీడియెట్ కోసం మరో చోటికి పంపించడం.. అక్కడ అడ్మిషన్లు ఇస్తారో.. ఇవ్వరో తెల్వదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అడుగుతరు. ఈ చదువుల కోసం వెళ్లిన చోట ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో సరైన వసతులు, టీచర్లు, లెక్చరర్లు లేకపోవడంలాంటి అంశాల వల్ల పేరేంట్స్ ప్రైవేట్ వైపు మొగ్గుచూపుతున్నారు. పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఒక్కో స్టూడెంట్‌పై రూ.20 వేలకు పైగా అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉంటే చదువు కోసమే రూ.60 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు.చదువుకునే పిల్లలు లేరని రెండేండ్ల కిందట సుమారు 2 వేల ప్రభుత్వ స్కూల్స్ మూత పడ్డాయి.
టీచర్లే లేనప్పుడు పిల్లలను ఎట్ల పంపుతారు..?
మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒక్క చోటనే పిల్లలు చదువుకునేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయడమే దీనికి పరిష్కారం. ఒక్కో స్కూల్‌లో సుమారు 1,500 మంది స్టూడెంట్స్ ఉండాలి. ఇప్పటికే రాష్ట్రంలో విద్య ప్రైవేట్ వ్యాపారంగా మారిపోయింది. విద్యపై ప్రతీయేటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు సరైన మార్గంలో ఈ నిధులు ఖర్చు చేస్తే మళ్లీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ తప్పకుండా గాడిన పడుతుంది.
స్కూల్ టీచర్ల జీతాలు, ప్రమోషన్లపై దుమారం రేగింది? కారణం ఏంటి?
స్కూల్ టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయి అని కమిషన్ చెప్పలేదు. ప్రమోషన్స్ విషయంలో టీచర్ అకౌంటబిలిటీ ఉండాలని సూచించినం. యూనివర్సిటీల్లో చదువులు చెప్పే లెక్చరర్.. పదోన్నతిపై ఫ్రొఫెసర్ కావాలంటే ఆయన కొత్తగా అప్లయ్ చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. ఇక్కడ కూడా టీచర్లు తమ అకౌంటబిలిటీని పాటిస్తే వారికే సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతుంది. ఇందులో తప్పేమున్నది. నా వరకైతే డీఈవో, విద్యా శాఖ కమిషనర్ పోస్టులకు కూడా అకౌంటబిలిటీ ఉండాలని కోరుకుంటాను.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే గ్రామాల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మూసేస్తారా?
గ్రామాల్లో ఉండే స్కూల్స్ మూసేయాలని కమిషన్ సిఫారసు చేయలేదు. రిపోర్ట్‌ను పూర్తిగా చదవకుండా కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. మూడో తరగతిలో ఉన్న స్టూడెంట్ పాఠం చదవలేకపోతున్నాడు. 5వ తరగతి స్టూడెంట్ లెక్కలు చేయలేకపోతున్నాడు. విద్యాహక్కు చట్టం ప్రకారం బడిలో ఉండాల్సిన పిల్లలు చాలా మంది బడి బయట ఉంటున్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, క్లాస్కో టీచర్ ఉంటే ఆటోమేటిక్‌గా పిల్లల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల రెగ్యులరైజేషన్ ముచ్చటే రాదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ ఉండొద్దు.
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఉండగా.. తెలంగాణ విద్యా పాలసీ ఎందుకు?
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని పార్లమెంట్‌లో చర్చించి ఆమోదించలేదు. ఇది విద్యా హక్కు కిందకు రాదు. తెలంగాణ విద్యా పాలసీని రైట్ టు ఎడ్యుకేషనల్యాక్ట్ ప్రకారం రూపొందించారు. ఇందులో సెక్యులర్ ఎడ్యుకేషన్, సోషల్ జస్టిస్ చాలా క్లియర్‌గా ఉంటుంది. స్కూళ్లలో ఎందరు స్టూడెంట్స్? టీచర్లు ఉండాలి? ఎలాంటి వసతులు ఉండాలో చాలా స్పష్టంగా చెప్పినం. ప్రతి స్కూల్ బాధ్యత ఆ జిల్లా కలెక్టర్లకు అప్పగించినం. ప్రతీ యేటా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బుల్లో ఎన్ని వృథా అవుతున్నాయో తెలియజేసినం. వీటిని రీ థింక్ చేసి విద్యా పాలసీని రూపొందించినం.
పాస్ మార్కులు 45 శాతం ఎందుకు?
ఒకప్పుడు 60 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడేమో 95, 98 శాతం మార్కులు ఎక్కువ మంది సాధిస్తున్నారు. మారిన కాలనుగుణంగా పాస్ మార్కులను కూడా 35 నుంచి 45 శాతానికి పెంచాం. పిల్లలపై పదో తరగతి ఎగ్జామ్ టెన్షన్ ఉండదు. పిల్లలపై ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి బాగా చదువుకొని 11, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధిస్తారని కమిషన్ భావించింది.
మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు కేటాయించడం కరెక్టేనా?
రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నపత్రాల లీకేజీలులాంటి జరగకుండా.. ఎలాంటి లొసుగులు లేకుండా.. చాలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించగలిగితే మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు కేటాయించవచ్చు. బిహార్ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఎగ్జామ్‌లో లొసుగులు బయటపడ్డాయి. ఇలాంటివి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
కమిషన్‌లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని బీజేపీ వాళ్లు అంటున్నారు? మీ ఆన్సర్ ?
ప్రజల వైపు ఉంటే నక్సలైటేనా? అట్లా అయితే బీజేపోళ్లు కూడా అర్బన్ నక్సల్సే అవుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదటి నుంచీ పోరాట పథంలోనే సాగింది. సాయుధ పోరాటం నుంచి మొదలుకొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు అందరూ పోరాటం చేశారు. అట్ల అయితే రాష్ట్ర ప్రజలంతా కూడా అర్బన్ నక్సలైట్లే. విద్యా పాలసీ అనేది రాజకీయ కోణంలో చూసేది కాదు. మన రాజకీయ కల్చర్ అంటే సమానత్వం.. సాంఘిక న్యాయం.. ఉద్యమం.. మార్పు.. విప్లవం. బీజేపీ వాళ్లకు పాలసీలో ఏమైనా తేడా కనిపిస్తే అది ఏంటో స్పష్టంగా చెబితే కమిషన్ వివరణ ఇస్తుంది. కానీ మొత్తం పాలసీనే తప్పుపట్టడం సరికాదు. ఈ పాలసీని చూసి కర్నాటక, ఢిల్లీ, చండీగఢ్ నుంచి అనూహ్య స్పందన వస్తున్నది.
