ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఆపండి : కవిత

ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఆపండి : కవిత
  • ప్రభుత్వానికి టీఆర్ఎస్​ చీఫ్ ​కవిత డిమాండ్
  • ఫీజు రీయింబర్స్​మెంట్​ వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి
  • ‘నాణ్యమైన విద్య .. ఫీజుల నియంత్రణ’పై రౌండ్​ టేబుల్ సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్​విద్యాసంస్థల ఫీజుల దోపిడీ ఆపాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్​) చీఫ్​ కవిత డిమాండ్ చేశారు. ఫీజుల దోపిడీని అరికట్టడంలో రేవంత్​సర్కార్​ ఘోరంగా ఫెయిల్​అయ్యిందని విమర్శించారు. వెంటనే ఫీజుల దోపిడీ నియంత్రణకు చట్టం తేవాలన్నారు. బుధావారం ఆమె హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య ఫీజుల నియంత్రణ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్​ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే ప్రైవేట్ విద్య సంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే మన విద్యాశాఖ మంత్రి కావడం ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజును పెంచకుండా ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో తల్లిదండ్రులు విద్య, వైద్యం కోసమే 60 నుంచి 70 శాతం వరకు తమ ఆదాయాన్ని ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రైవేట్ స్కూల్ లో దాదాపు 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.   

ఫీజు రీయింబర్స్​మెంట్​ను బొంద పెడ్తున్నరు

ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టకపోగా.. ఫీజు రీయింబర్స్ మెంట్ ను కూడా బొందపెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని కవిత ఆరోపించారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 7తో రీయింబర్స్ మెంట్ కు మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వెంటనే ఆ జీవోను రద్దు చేసి.. రూ.11,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోతే అధికంగా నష్టపోయేది ఆడపిల్లలేనని, చదువుల భారం ఎక్కువైతే కొడుకులకన్నా ముందు కూతుళ్లనే చదువు మాన్పించే పరిస్థితి వస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పీఎస్) లో అడ్డగోలు అవినీతి జరుగుతోందని కవిత ఆరోపించారు. ఈ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.  ప్రభుత్వ భూముల్లో కొనసాగుతున్న హెచ్ పీఎస్ ఈ ఏడాది 120 శాతం ఫీజు పెంచిందని చెప్పారు. ప్రభుత్వ స్థలంలో కొనసాగే స్కూల్లోనే ఈ పరిస్థితి ఉంటే.. చైతన్య, నారాయణ లాంటి స్కూళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఒకే వ్యక్తి గత 14 ఏళ్లుగా అదే పదవిలో కొనసాగుతూ, కొత్తగా వచ్చేవారికి అవినీతి పాఠాలు నేర్పుతున్నారని మండిపడ్డారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ పనితీరుపై సమగ్ర సమీక్ష జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.