సాలార్‌‌ జంగ్‌‌ మ్యూజియం రెనోవేషన్ చేయండి : గవర్నర్‌‌ శివప్రతాప్ శుక్లా 

సాలార్‌‌ జంగ్‌‌ మ్యూజియం రెనోవేషన్ చేయండి : గవర్నర్‌‌ శివప్రతాప్ శుక్లా 
  • దర్శకులకు మెరుగైన అనుభూతి కల్పించేలా గ్యాలరీల అభివృద్ధి 
  • గవర్నర్‌‌ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్‌‌, వెలుగు: సాలార్‌‌జంగ్ మ్యూజియంను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. సందర్శకులకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని కోరారు.

శనివారం రాజ్‌‌భవన్‌‌లో తన అధ్యక్షతన జరిగిన సాలార్‌‌జంగ్‌‌ మ్యూజియం బోర్డు సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ఈ మీటింగ్‌‌లో మ్యూజియం అభివృద్ధి, సందర్శకుల సౌకర్యాల మెరుగుదల, విద్యా కార్యక్రమాల విస్తరణ తదితర 13 అజెండా అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మ్యూజియంలు భావితరాలకు చరిత్ర, నాగరికతా వికాసాన్ని పరిచయం చేసే విజ్ఞాన కేంద్రాలని పేర్కొన్నారు. అరుదైన కళాఖండాల విశిష్టతను సందర్శకులకు సులభంగా అర్థమయ్యేలా వివరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.  

మ్యూజియం అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 

మ్యూజియం క్యురేటర్‌‌ రితేష్‌‌ శర్మ గ్యాలరీల ఆధునికీకరణ ప్రణాళికలపై గవర్నర్‌‌కు పవర్‌‌పాయింట్‌‌ ప్రజెంటేషన్‌‌ ఇచ్చారు. కార్పెట్‌‌, ఆధునిక కళలు, భారతీయ సూక్ష్మ చిత్రాలు, బొమ్మలు -టాక్సిడెర్మీ, ఫర్నిచర్‌‌, సంగీత గడియారం, వస్త్రాలు,పిల్లల గ్యాలరీలను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. తాత్కాలిక ప్రదర్శనల కోసం ప్రత్యేక గ్యాలరీ, మెట్ల బావి అభివృద్ధి ప్రాజెక్టు, సందర్శకులకు సమగ్ర అవగాహన కల్పించే ఇంటరాక్టివ్‌‌ ఓరియంటేషన్‌‌ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

భద్రత కోసం ఫైర్ సేఫ్టీ వ్యవస్థ, సమాచార బోర్డుల ఏర్పాటుతో పాటు విజిటర్స్ సౌకర్యార్థం సెంట్రలైజ్డ్ ఏసీ, వాటర్‌‌ప్రూఫింగ్‌‌, కొత్త లిఫ్టుల ఏర్పాటు ప్రతిపాదనలను ఆయన సమర్పించారు. యువతకు చారిత్రక సంపదపై అవగాహన కల్పించే కార్యక్రమాల వివరాలను ఎడ్యుకేషన్ క్యూరేటర్ జ్యోతి రాయ్ వివరించారు. ఈ సమావేశంలో గవర్నర్‌‌ స్పెషల్ సీఎస్ దానకిశోర్‌‌, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ఓయూ వీసీ కుమార్‌‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.