
- ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్
- జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. మినీ జాతర సందర్భంగా వీరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహంకాళి అమ్మవారికి గవర్నర్ దంపతులు బోనంతో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 13, 14 తేదీల్లో జరిగే లష్కర్ బోనాల జాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంతో ప్రతిష్ట కలిగిన ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సకాలంలో వర్షాలు పడి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.
మరోవైపు వివిధ శాఖల అధికారులతో కలిసి మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా --కార్యక్రమాల్లో దేవాదాయ కమిషనర్ ఎస్ వెంకట్రావు, కలెక్టర్ హరి చందన, డీసీపీ రష్మీ పెరుమాళ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, చైర్మన్ సురిటి రామేశ్వర్, ఈవో మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.