
తెలంగాణ సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పారు. చాలా కాలంగా సీఎం తనని కలవలేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్‌తో సీఎం కాలానుగుణంగా చర్చలు జరపడం తప్పనిసరి అని తమిళిసై తెలిపారు. కానీ తెలంగాణలో అలా జరగడం లేదని , సీఎం తనని గత రెండేళ్లుగా కలవలేదని చెప్పారు. గవర్నర్, సీఎంతో సత్సంబంధాలు ఉండాలని తమిళిసై వెల్లడించారు.
https://twitter.com/ANI/status/1650383258461384707
మరోవైపు పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో మూడు బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా వాటిలో తాజాగా ఒకదాన్ని తిరస్కరించి.. మిగిలిన రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు. డీఎంఈ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) వయో పరిమితి బిల్లును తిరస్కరించిన గవర్నర్ .. మున్సిపల్ నింబంధనలు, ప్రైవేటు వర్సిటీల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఎలాంటి పెడింగ్ బిల్లులు లేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 24 సోమవారం రోజున దీనిపై విచారణ జరగనుంది. ఈనేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.