- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
- రాష్ట్రాన్ని గ్లోబల్ స్కిల్ హబ్‌గా మార్చేందుకు కృషి
- రైతు రుణమాఫీ, మహిళా సాధికారతతో పేదల జీవితాల్లో వెలుగులు
- రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో పరి పాలన సాగిస్తోందని.. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం పునాదులుగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
77వ రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. 2047 నాటికి ‘వికసిత్ తెలంగాణ’ సాధనతో పాటు రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
రైతు రుణమాఫీ, మహిళా సాధికారత పథకాలతో సామాన్యుడి బతుకు చిత్రంలో మార్పు తెచ్చామన్నారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ఆ మూడు ప్రాంతాల సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్’ విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేశామన్నారు. ఈ విధానం వల్ల సంపద వికేంద్రీకరణ జరిగి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ స్కిల్ హబ్‌గా మార్చేలా రైజింగ్ డాక్యుమెంట్‌ను అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.
ప్రగతికి సరికొత్త బాటలు
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్లు పూర్తి చేసు కున్న ప్రజా ప్రభుత్వం, అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని గవర్నర్ ప్రశంసించారు. కేంద్రం నిర్దేశించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ దార్శనిక పత్రం ద్వారా రాష్ట్రంలో సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామన్నారు. గత డిసెంబర్‌లో జరిగిన గ్లోబల్ సమిట్‌లో ప్రపంచ ప్రతినిధుల సమక్షంలో ఈ విజన్‌ను ఆవిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
రాబోయే రెండున్నర దశాబ్దాల్లో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే శక్తిగా తెలంగాణ ఎదుగుతుందని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గవర్నర్ పేర్కొన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, రెండో దశ మెట్రో విస్తరణ, కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం ఇందులో భాగమేనని తెలిపారు. అలాగే మూసీ నది పునరుజ్జీవం కోసం 55 కిలోమీటర్ల మేర భారీ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, ఇది పర్యాటకంగానూ, పర్యావరణపరంగానూ హైదరాబాద్ రూపురేఖలను మారుస్తుందని తెలిపారు.
రైతన్నకు భరోసా.. వ్యవసాయానికి పెద్దపీట
దేశానికి అన్నం పెట్టే రైతన్న సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి 26 లక్షల మంది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపామని, ఇందుకోసం రూ.20,617 కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. రైతు భరోసా కింద ఎకరాకు ఇచ్చే సాయాన్ని రూ.12 వేలకు పెంచడమే కాకుండా, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు.
ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించి, భూభారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామన్నారు. రైతుల ఆదాయం పెంచడానికి, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడించడానికి ప్రత్యేకంగా ఫార్మర్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయమని గవర్నర్ కొనియాడారు.
విద్యారంగంలో మార్పులు
యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, గత పదేళ్లలో టీజీపీఎస్సీ ద్వారా 62,749 ఉద్యోగాలను భర్తీ చేశామని గవర్నర్ వెల్లడించారు. ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ను ప్రారంభించామన్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ, వారిని పరిశ్రమలకు అవసరమైన విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని, మెస్, కాస్మెటిక్ చార్జీలను భారీగా పెంచి విద్యార్థులకు అండగా నిలిచామని గవర్నర్ పేర్కొన్నారు.
మహిళా శక్తికి పట్టం.. మహాలక్ష్మి పథకంతో లబ్ధి
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా ‘ఇందిరా మహిళా శక్తి’ మిషన్‌ను ప్రభుత్వం అమలు చేస్తోందని గవర్నర్ తెలిపారు. మహిళా సంఘాలకు రూ.40 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు కల్పించామన్నారు. ఇప్పటివరకు మహిళలు 267 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు చేశారని, తద్వారా రూ.9 వేల కోట్లకు పైగా ఆదా చేసుకున్నారని వివరించారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి రూ.2,700 కోట్లు కేటాయించామన్నారు. రేషన్ కార్డుల ద్వారా 1.03 కోట్ల కుటుంబాలకు, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మొదటి దశలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు.
