ఉద్యోగ సంఘాలకు చెక్​పెట్టే యోచనలో రాష్ట్ర సర్కార్​

ఉద్యోగ సంఘాలకు చెక్​పెట్టే యోచనలో రాష్ట్ర సర్కార్​

టీచర్​ యూనియన్లు, ఉద్యోగ సంఘాలకు చెక్​పెట్టే యోచనలో రాష్ట్ర సర్కార్​

టీచర్​, ఎంప్లాయీస్​ యూనియన్లకు చెక్​ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీలో రెండేండ్ల పాటు గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పిన సర్కార్​.. దీన్నే ఇతర సంస్థలకు వర్తింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఎన్నికలను డిలే చేస్తూ పోతే.. యూనియన్లనేవి మనుగడలో ఉండవని, ఫలితంగా యూనియన్​ లీడర్లు కూడా ఉండరని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూనియన్ నేతలకు ఉండే ప్రత్యేక సౌకర్యాలను కూడా ప్రభుత్వం కట్​చేసింది. వాటిని భవిష్యత్ లో పొడిగించే చాన్స్​ కూడా లేనట్లు తెలుస్తోంది. ఓడీ(అదర్​ డ్యూటీ) సౌకర్యం కొనసాగించాలంటూ ఈ మధ్య పలు సంఘాల నేతలు ప్రగతిభవన్ వర్గాలను సంప్రదించగా.. ఆ ఒక్కటి మాత్రం అడగొద్దని తేల్చిచెప్పినట్లు సమాచారం. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అన్ని సంఘాలతో సీఎం ఎంతో చనువుగా ఉండేవారు. కానీ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఎంప్లాయీస్​ యూనియన్లకు,  ప్రగతిభవన్ కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

రెండోసారి అధికారం చేపట్టాక కేసీఆర్.. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని యూనియన్​ నేతలు అంటున్నారు. ఒక్క ఆర్టీసీలోనే కాదు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి ఇలా దాదాపు అన్ని సంస్థల్లోని సంఘాలకు చెక్​ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎంప్లాయీస్​లో చర్చ నడుస్తోంది.

ఆర్టీసీతో మొదలు..

అక్టోబర్​ 5 నుంచి 52 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మె కాలంలో ఆ అంశంపై సమీక్షించిన ప్రతిసారి సీఎం కేసీఆర్​ ఆర్టీసీ యూనియన్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూనియన్ల వల్లే  సమస్యలు వస్తున్నాయని, సంస్థలో ఇక యూనియన్ల ముచ్చటే ఉండదని స్పష్టం చేశారు. సమ్మె ముగిసిన తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రగతిభవన్​కు భోజనానికి పిలిపించుకున్న సీఎం.. ఇటు కార్మికులకు వరాలు ప్రకటిస్తూనే అటు సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించబోమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో గుర్తింపు సంఘం ఎన్నికలు వద్దంటూ లేఖలపై సంతకాలు చేయాలని కార్మికులపై ఒత్తిడి తేవడం కలకలం రేపింది.

టీచర్ సంఘాలపై గుస్సా

స్కూళ్లలో పాఠాలు చెప్పేవారు 1.30 లక్షల మంది ఉన్నారు. విద్యాశాఖలో దాదాపు 50  టీచర్ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల నేతలు యూనియన్ యాక్టివిటీ పేరుతో అసలు డ్యూటీలకే రావడం లేదని ప్రభుత్వం అనుమానిస్తోంది. యూనియన్  నేతల వల్లే  కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు బ్రేకు పడినట్లు ప్రభుత్వం భావిస్తోందని ఓ అధికారి చెప్పారు. ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులపై ఓ ఉపాధ్యాయ సంఘం కోర్టుకు వెళ్లడాన్ని కూడా సీరియస్​గా తీసుకుందని పేర్కొన్నారు. సంఘాల వల్లే విద్యావ్యవస్థలో సమస్యలు తలెత్తుతున్నాయని, ఏ యూనియన్​ లీడర్​ను కూడా ఎంకరేజ్ చేయొద్దని విద్యాశాఖ ఆఫీసర్లకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది.

ఉద్యోగ సంఘాలకు మళ్లీ పిలుపేది?

పీఆర్సీతోపాటు పలు సమస్యలపై సీఎంను కలిసి వివరించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు చాలా కాలంగా ఎదురుచూశారు. ఆయన అపాయింట్​మెంట్​ దక్కలేదు. అయితే.. ఉన్నట్టుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె టైంలో మాత్రం సీఎంవో  నుంచి పిలుపు వచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతిభవన్​కు పిలిపించుకొని మాట్లాడిన సీఎం.. త్వరలో మళ్లీ కలుద్దామని, అప్పుడు సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి పంపారు. ఆర్టీసీ కార్మికులతో ఉద్యోగులు జత కడుతారని పసిగట్టే, ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మళ్లీ కలుద్దామని చెప్పిన సీఎం.. దాదాపు 2 నెలలైనా ఉద్యోగ సంఘాలను మళ్లీ పిలవలేదు. కొన్ని రోజుల క్రితం సీఎంవో నుంచి ఓ ప్రకటన వచ్చింది. రెండు వారాల్లో పీఆర్సీ కమిటీ నుంచి రిపోర్టు తెప్పించుకుంటామనేది ఆ ప్రకటన సారాంశం. కానీ.. ఈ లోపు కమిటీ గడువును వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు. దీంతో పీఆర్సీ ఇప్పట్లో ప్రకటించబోమనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చినట్లయింది.

ఓడీలకు చెల్లుచీటీ

యూనియన్​ నేతలు డ్యూటీలకు రాకుండా వెసులుబాటు కల్పించే ఓడీ (అదర్​ డ్యూటీ) సంప్రదాయం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. రాష్ట్రంలో సుమారు 30 సంఘాల్లోని 50 నుంచి 60 మంది నాయకులకు ఈ సౌకర్యం ఉంది. అయితే ఏడాదిగా ఓడీలు అమలు కావడం లేదు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ తమనే కొందరు లీడర్లు బ్లాక్​మెయిల్​ చేస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఏటా డిసెంబర్ చివరి నాటికి ఓడీల కాలపరిమితి ముగుస్తుంది. తిరిగి జనవరిలో కొత్తగా ప్రతి ఒక్కరికి విడివిడిగా జీవో ఇచ్చి ఓడీలు కొనసాగించాల్సి ఉంటుంది. 2018 డిసెంబర్ చివరి నాటితో ముగిసిన ఓడీలను ఇప్పటివరకు ప్రభుత్వం పొడిగించలేదు. ఓడీల కొనసాగింపు కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పక్కనబెట్టింది. దీని కోసం  ఏడాదిగా లీడర్లు సీఎంవో చుట్టు తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు.  ‘2018 డిసెంబర్ నుంచి ఇంత వరకు ఎవరికీ ఓడీలు ఇవ్వలేదు. ఓడీల ఫైల్స్​ సుమారు 30 వరకు మా వద్దే ఉన్నాయి. చాలా మంది లీడర్లు ఓడీల కోసం వస్తున్నారు’ అని ఓ సీనియర్ అధికారి వివరించారు.  ఇదిలా ఉంటే.. యూనియన్ నేతలు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు అధికార వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ఓడీలు రద్దు చేశాక లీడర్లు డ్యూటీలకు వెళ్తున్నారా? లేదా? అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. యూనియన్​ లీడర్ల కదలికపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పూర్తి సమాచారం అందుతోందని ఓ అధికారి చెప్పారు.

సింగరేణిలో ఎన్నికల ఆలస్యానికి ప్రయత్నాలు!

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు వద్దంటూ ఇటీవల కొందరు కార్మికులతో కార్మిక శాఖకు లేఖలు రాయించారు. దీంతో కార్మిక శాఖ అధికారులు ఎలక్షన్స్ లేవని చెప్తున్నారు. ‘ఎన్నికలు వద్దని కార్మికులే అభ్యంతరం చెప్తుంటే మేము ఎలా ఎన్నికలు నిర్వహిస్తాం’ అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. రెండేండ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు సంఘాలు ఉండవని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీసీలో అమలు చేసిన వ్యూహాన్నే సింగరేణిలో కూడా అమలుచేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. ఆ సంస్థలో జరిగే ఎన్నికల ప్రక్రియ మొత్తం కేంద్రం ఆధీనంలో జరుగుతోంది. గుర్తింపు సంఘం కోసం నిర్వహించే ఎన్నికలు ఎప్పుడు జరపాలనే అంశం కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఉంటుంది. సింగరేణి కార్మికుల్లో పట్టు ఉన్న ఓ నేత ఈ మధ్య బీజేపీ అనుబంధ కార్మిక సంఘంలో చేరారు. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘంలోనూ విభేదాలు ముదిరాయి. ఈ సమయంలో ఎన్నికలు జరిపితే తమకు లాభం ఉండదని టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకని ఎన్నికలను కొంతకాలం వాయిదా వేయాలంటూ కార్మిక శాఖకు కార్మికులతో లేఖలు ఇప్పిస్తే  ఎలా ఉంటుందని ఆ వర్గాలు  భావిస్తున్నాయి.

సింగరేణిలోనూ ఆర్టీసీ ఫార్ములా?

ఆర్టీసీలో అమలు చేసిన వ్యూహాన్నే సింగరేణిలో కూడా అమలుచేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు వద్దంటూ ఇటీవల కొందరు కార్మికులతో కార్మిక శాఖకు లేఖలు రాయించారు. దీంతో కార్మిక శాఖ అధికారులు ఇప్పట్లో ఆర్టీసీలో  ఎలక్షన్స్ లేవని చెప్తున్నారు. ‘ఎన్నికలు వద్దని కార్మికులే అభ్యంతరం చెప్తుంటే మేము ఎలా ఎన్నికలు నిర్వహిస్తాం’ అని కార్మిక శాఖలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఇదే రీతిలో సింగరేణి ఎన్నికలను కూడా ఆలస్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ నడుస్తోంది.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి