సర్కారు బాకీ రూ. 5,400 కోట్లు

సర్కారు బాకీ రూ. 5,400 కోట్లు
  • కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల బకాయిలు రూ. 3 వేల కోట్లకు పైనే 
  • 16 జిల్లాల్లోని గవర్నమెంట్ ఆఫీసుల పెండింగ్ బిల్లులు రూ. 80 కోట్లు 
  • బిల్లులు కట్టని లిస్టులో కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు 

విద్యుత్ పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయి పడింది బకాయి పడింది. రూ.వేల కోట్లు చెల్లించకుండా ఏండ్ల తరబడి బిల్లులు పెండింగ్​లో పెడుతున్నది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)కు రాష్ట్ర సర్కార్ రూ.5,400 కోట్లు బాకీ ఉంది. ఇందులో ఈ ఏడాది అక్టోబర్ వరకు ఇరిగేషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు సంబంధించినవే రూ.5,321 కోట్ల వరకు పేరుకుపోయాయి.  వీటిలో రూ.3 వేల కోట్లకుపైగా కేవలం కాళేశ్వరం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కరెంట్ బిల్లులే ఉన్నాయి. ఎన్పీడీసీఎల్​ పరిధిలోని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, ఇతర గవర్నమెంట్  డిపార్ట్​మెంట్లకు సంబంధించిన కరెంట్ బిల్లులు రూ.80 కోట్ల దాకా పెండింగ్​లో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ గంగాధర కిశోర్ ఎన్పీడీసీఎల్​కు ఆర్టీఐ కింద అప్లయ్​ చేయగా.. ఆ కంపెనీ సర్కార్ బకాయిల వివరాలు వెల్లడించింది. సామాన్యుడు ఎవరైనా వరుసగా రెండో నెల కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ కట్ చేసే అధికారులు.. ప్రభుత్వం ఈ స్థాయిలో బకాయి ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

ఆదిలాబాద్ ఎస్పీ ఆఫీస్ బాకీ రూ.10 లక్షలు
ఎన్పీడీసీఎల్ పరిధిలోని కలెక్టర్ ఆఫీసుల కరెంట్​ బిల్లులు రూ. 26.82 లక్షలు, ఎస్పీ ఆఫీసుల కరెంట్​ బిల్లులు రూ. 26.86 లక్షలు పేరుకుపోయాయి. కలెక్టరేట్లలో ఎక్కువగా హనుమకొండ కలెక్టరేట్ బిల్లు బకాయి రూ. 6 లక్షలు ఉండగా.. ఎస్పీ ఆఫీసుల్లో ఎక్కువగా ఆదిలాబాద్ ఎస్పీ ఆఫీస్ బకాయి రూ. 10.60 లక్షలు ఉంది. అయితే.. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్ ఆఫీసులతోపాటు జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల ఎస్పీ ఆఫీసులు ఎలాంటి బకాయిలు లేవు. 

గవర్నమెంట్ ఆఫీసులవీ పేరుకుపోయినయ్​
ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాలకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసుల నుంచి నెలనెలా కరెంట్ బిల్లులు వసూలు కావడం లేదు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులతోపాటు 13 సెక్టోరియల్ డిపార్ట్​మెంట్ల ఆఫీసుల బిల్లులు రూ.80 కోట్ల వరకు పెండింగ్​లో ఉన్నాయి. సెక్టోరియల్ డిపార్ట్మెంట్ల వారీగా చూస్తే పోలీస్ శాఖ నుంచి రూ.13.81 కోట్లు, హెల్త్ డిపార్ట్​మెంట్ నుంచి రూ.13.48 కోట్లు, రెవెన్యూ డిపార్ట్​మెంట్ నుంచి రూ.10.12 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్  కౌన్సిల్ కు సంబంధించిన ఆఫీసుల  నుంచి రూ.5.70 కోట్లు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ నుంచి రూ. 1.74 కోట్లు, బీసీ వెల్ఫేర్ నుంచి రూ.27 లక్షలు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రూ.26.11 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి రూ.6.52 కోట్లు, పశుసంవర్థక శాఖ నుంచి రూ.69 లక్షలు, టూరిజం నుంచి రూ. 7 లక్షలు, మార్కెట్ కమిటీల నుంచి రూ. 32 లక్షలు ఎన్పీడీసీఎల్​కు రావాల్సి ఉంది

ఇరిగేషన్, మిషన్ భగీరథ బిల్లులే మస్తు
ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగు నీటి స్కీమ్​ల కరెంట్ బిల్లులు మోత మోగుతున్నాయి. సాగు నీటి ప్రాజెక్టుల నుంచి రైతులకు పూర్తి స్థాయిలో నీరందకపోయినా.. మిషన్ భగీరథ నీళ్లు అందరి ఇండ్లకు చేరకపోయినా అందులో ఉపయోగిస్తున్న మోటార్ల కరెంట్ బిల్లులు కోట్ల రూపాయల్లో వస్తున్నాయి. ఇరిగేషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులు రూ.5,321 కోట్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 48 పంపులు నడుస్తుండగా.. రూ.1,745.48 కోట్ల కరెంట్ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. ఇందులో భూపాలపల్లి జిల్లాలో రూ.187 కోట్లు, కరీంనగర్ జిల్లాలో రూ.716 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో రూ.833 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ. 1,375.16 కోట్లు ఉండగా.. ఇందులో హనుమ కొండ జిల్లా పరిధిలోని మోటార్ల కరెంట్ బిల్లులు రూ. 461.78 కోట్లు, భూపాలపల్లి జిల్లాలో రూ.769.20 కోట్లు, జనగామ జిల్లాలో రూ.144.18 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కరెంట్ బిల్లులు రూ. 952.52 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. తాగునీటి సరఫరాకు సంబంధించి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రూ.460.93 కోట్లు, మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్​ మోటార్ల బిల్లులు రూ.631 కోట్లు చెల్లించాల్సి ఉంది.