కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. మైనింగ్, కార్మిక మంత్రిగా వివేక్

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. మైనింగ్, కార్మిక మంత్రిగా వివేక్
  • అడ్లూరి లక్ష్మణ్​కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం
  • వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖలు 
  • కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ,​ ఫ్యాక్టరీలతో పాటు మైనింగ్ అండ్ జియాలజీ శాఖలను అప్పగించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలు కేటాయించారు. వీటితో పాటు దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌‌జెండర్ల సాధికారత శాఖ బాధ్యతలూ అప్పగించారు. మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖలతోపాటు క్రీడలు, యువజన సేవల శాఖలను  కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్టు పేర్కొన్నారు. 

రాష్ట్ర ఎకానమీకి అత్యంత కీలకమైన మైనింగ్ శాఖ బాధ్యతలను మంత్రి వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. గనుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాల నిర్వహణలాంటి కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వివేక్​కు ఉన్న అనుభవం, రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శాఖలను కేటాయించినట్టు తెలుస్తోంది. గతంలో వివేక్ తండ్రి దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) కూడా1978–1982 మధ్య ఉమ్మడి ఏపీలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలోనూ కార్మిక  మంత్రిత్వ శాఖను నిర్వహించారు.

వివేక్ అన్న గడ్డం వినోద్ కూడా ఉమ్మడి ఏపీలో వైఎస్​ హయాంలో 2004 నుంచి 2009 వరకు కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఇలా వివేక్ కుటుంబానికి కార్మికులతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయనకు దీనితోపాటు ఇతర కీలకమైన శాఖల బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌ సామాజిక నేపథ్యం, గతంలో ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం దృష్ట్యా ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి వాకిటి శ్రీహరికి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వృత్తులకు దగ్గరగా ఉన్న పశుసంవర్ధక, డెయిరీ డెవలప్​మెంట్, మత్స్య శాఖలను కేటాయించినట్లు చెప్తున్నారు.

ఇతర మంత్రుల శాఖలు మార్చలే..  
కొత్త మంత్రులకు ముందు కేబినెట్​లో సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. వారిలో కొందరి శాఖలను మార్చే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగి మూడురోజులైనా శాఖలు కేటాయించకపోవడంతో ఈ రకమైన ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ పాత మంత్రుల్లో ఏ ఒక్కరి శాఖను కూడా మార్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖల నుంచే కొన్నింటిని ముగ్గురు కొత్త మంత్రులకు కేటాయించారు. ప్రస్తుతం సీఎం దగ్గర ఇంకా 7 శాఖలు (ఎడ్యుకేషన్, హోం, జీఏడీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్, కమర్షియల్ ట్యాక్స్​, లా, పబ్లిక్ ఎంటర్​ప్రైజెస్) ఉన్నాయి.