అలిశెట్టి కుటుంబానికి డబుల్ ​బెడ్రూం ఇల్లు

అలిశెట్టి కుటుంబానికి డబుల్ ​బెడ్రూం ఇల్లు

హైదరాబాద్, వెలుగు :  కవి అలిశెట్టి ప్రభాకర్​కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్​బెడ్​రూమ్​ ఇల్లు ఇచ్చింది. అలిశెట్టి భార్య భాగ్యమ్మకు ఆసిఫ్​నగర్​లోని జియాగూడలో నిర్మించిన డబుల్ ​బెడ్రూం కాంప్లెక్స్​లో ఒక ఇంటిని ఇ కేటాయించింది. ఈ మేరకు హైదరాబాద్​కలెక్టర్ ​శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన అలిశెట్టి కవి ప్రభాకర్​ ఉమ్మడి రాష్ట్రంలో సామాన్యులకు జరిగిన అన్యాయాలపై అనేక రచనలు చేశారు.

 పేదరికం, మహిళల సమస్యలు, పల్లెలు, పట్నం బాధలు, సామాజిక అసమానతలు, అన్యాయాలపై కవితలు రాశారు. సమాజం కోసం జీవితాన్నే అంకితం చేసిన ఆయన భార్య, పిల్లలు పేదరికంలో ఉన్నారు. ఆయన భార్య భాగ్యమ్మ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్​అలిశెట్టి కుటుంబానికి సాయం చేయాలని మంత్రి కేటీఆర్​ను ఆదేశించారు. 

ఈ మేరకు అలిశెట్టి కుటుంబానికి డబుల్​బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్​ఆదేశించగా, హైదరాబాద్​కలెక్టర్​ఉత్తర్వులు జారీ చేశారు. భాగ్యమ్మ, అలిశెట్టి కుమారులు సంగ్రామ్, సాకేత్​ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.