జూనియర్ కార్యదర్శులకు కేసీఆర్ వార్నింగ్ విధుల్లో చేరకుంటే.. ఉద్యోగం పీకేస్తా

జూనియర్ కార్యదర్శులకు కేసీఆర్ వార్నింగ్ విధుల్లో చేరకుంటే.. ఉద్యోగం పీకేస్తా

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు జూనియర్ పంచాయితీ కార్యదర్శకులకు నోటీసులు జారీ చేసింది. మే 09వ తేదీ  సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొంది.  పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వం నుంచి స్పందన లేదు..

తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లు ఏప్రిల్ 28 నుంచి సమ్మె చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఏప్రిల్ 13 తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత 15 రోజుల నోటీసు పీరియడ్ ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఏప్రిల్ 28వ తేదీ నుంచి జూనియర్ పంచాయితీ కార్యదర్శులు నిరవధిక సమ్మెకు దిగారు. 11 రోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టినా..ఎలాంటి స్పందన రాలేదు.

 

ప్రొబెషనరీ కాలం ఏడాది పెంపు

 

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జేపీఎస్ ల ప్రొబెషనరీ గడువు ఏప్రిల్ 11 2023తో పూర్తయింది. అయినప్పటికీ ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌ గురించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ కారణంగానే జూనియర్ పంచాయితీ సెక్రటరీలు సమ్మెబాట పట్టారు. 2019 ఏప్రిల్‌ 12న విధుల్లో చేరిన జేపీఎస్ లను మూడేళ్ల ప్రొబెషనరీ కాలం తర్వాత రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మరో ఏడాది ప్రొబెషనరీ కాలాన్ని పెంచింది. మొత్తం నాలుగేళ్లు ప్రొబేషనరీ కాలం ముగిసినా.. ప్రభుత్వం జూనియర్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్‌ చేయడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రతి కార్యదర్శి క్రియాశీలంగా పనిశారు. 

జూనియర్ పంచాయితీ కార్యదర్శుల డిమాండ్లు..

  • జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ 6.0 జీవో  విడుదల చేయాలి.
  •  గడిచిన 4 సంవత్సరాల  ప్రొబెషనరీ  కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలి. 
  • ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను అందరినీ JPS లు గా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబెషనరీ పిరియడ్లో భాగంగా పరిగణించాలి.  వారిని కూడా రెగ్యూలర్ చేయాలి.
  •  రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ ను నిర్ధారించి ప్రకటించాలి
  • మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టి ఆదుకో వాలి.