ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్​మెంట్

ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్​మెంట్
  • ఒక్కో ఉద్యోగి జీతం రూ.8 వేల నుంచి 
  • 11 వేల వరకు పెరుగుతుంది: మంత్రి పొన్నం 
  • పెంచిన ఫిట్​మెంట్ వల్ల సంస్థపై ఏడాదికి 418 కోట్ల భారం
  • 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి ..  జూన్​ 1 నుంచి అమలు
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్​మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్థికంగా ఆర్టీసీ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగుల సంక్షేమం కోసం ఫిట్​మెంట్ ప్రకటించినట్టు చెప్పారు. సర్కారు నిర్ణయంతో ఒక్కో ఉద్యోగి జీతం రూ.8 వేల నుంచి 11 వేల వరకు పెరుగుతుందన్నారు. ఫిట్​మెంట్​ జూన్ ​ఫస్ట్​ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. పేస్కేల్​–2017 ఎరియర్స్ ను​ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో వడ్డీ లేకుండా చెల్లిస్తామన్నారు. పెంచిన ఫిట్​మెంట్ వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 418.11 కోట్ల భారం పడుతుందని మంత్రి పొన్నం తెలిపారు. మొత్తం 53,071 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టు చెప్పారు.

డ్రైవర్లు, కండక్టర్లతోపాటు, ఇతర సిబ్బంది ఎంతో కష్టపడి ఈ పథకాన్ని సక్సెస్​ చేశారని మంత్రి ప్రశంసించారు. ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేశారన్నారు. ఎక్కడా బస్సులు తగ్గించలేదని, బస్సుల్లో ఆక్యూపెన్సీ వంద శాతం పెరిగిందని చెప్పారు. కొన్నిచోట్ల బస్సులు సరిపోవడం లేదని, 2,500 కొత్త బస్సులను తీసుకొస్తున్నామని చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించడం ఇష్టం లేక బీఆర్​ఎస్​ నాయకులు ఆటోవాళ్లను రెచ్చగొట్టారన్నారు.  గతంలో ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్​ నిధులను కూడా ప్రభుత్వం వాడుకునే పరిస్థితి ఉండేదన్నారు. గత ప్రభుత్వం పీఆర్సీ 2017లో 16 శాతం ఫిట్​మెంట్​ ప్రకటించి అమలు చేయలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలన్నీ కాంగ్రెస్​కు మద్దతుగా నిలిచాయని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహాలక్ష్మి పథకం వచ్చాక బస్సులు, బస్టాండ్లు కళకళలాడుతున్నాయన్నారు. ఆర్టీసీలో నూతన ఉద్యోగ నియామకాలు చేపడుతామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. కొత్త రుట్లలో బస్సులు నడపే అంశాన్నీ కూడా పరిశీలిస్తామన్నారు. 

బస్సులు తగ్గిస్తున్నామన్నది అబద్ధం

మహాలక్ష్మి పథకం వల్ల బస్సులు తగ్గిస్తున్నామన్నది పచ్చి అబద్ధమని సంస్థ ఎండీ సజ్జనార్​ చెప్పారు. ఆర్టీసీకి చెందిన ప్రతి ఏడు బస్సుల్లో ఆరింటిని మహాలక్ష్మి పథకం కోసమే వినియోగిస్తున్నామని సజ్జనార్ పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషమని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్​ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డి, ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజును కలిసి ​ధన్యవాదాలు తెలిపారు. హార్డ్​వర్క్​చేసే సిబ్బందికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు.