
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల పెండ్లికి మ్యారే జ్ ఇన్సెంటివ్ అవార్డ్ కింద రూ. లక్ష ప్రోత్సాహకం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకు అనుగుణంగా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్ జీవో 7ను మంగళవారం జారీ చేశారు. గతంలో.. పెండ్లి చేసుకున్న జంటలో ఒకరు దివ్యాంగులు ఉంటేనే రూ. లక్ష ప్రోత్సాహకాన్ని ఇచ్చేవారు. ఇద్దరు దివ్యాంగులు పెండ్లి చేసుకుంటే ఈ స్కీమ్ వర్తించేది కాదు. కానీ ఇప్పుడు, ఇద్దరు దివ్యాంగులు పెండ్లి చేసుకున్నా రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
దీనిపై వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులను దివ్యాంగులు పెండ్లి చేసుకుంటే రూపాయి రాకపోయేదన్నారు. దీని కోసం గడిచిన పదేండ్లల్లో ఎన్నో నిరసనలు చేశామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో దివ్యాంగులను దివ్యాంగులు పెండ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా మరో రూ.లక్ష వస్తుందని వీరయ్య పేర్కొన్నారు.