గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 2 డీఏలు ..అక్టోబర్ జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లింపు

 గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 2 డీఏలు ..అక్టోబర్ జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లింపు
  •     6.37 శాతం పెరిగిన కరువు భత్యం   
  • అక్టోబర్ జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లింపు
  •     జీపీఎఫ్ఉద్యోగులకు2 డీఏలు
  • జీవో 128, 130 జారీ చేసిన ప్రభుత్వం
  •   ఖాతాల్లోకి బకాయిలు సీపీఎస్ వారికి 10 శాతం ప్రాన్‌‌‌‌కు.. 


హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కారు దసరా కానుక అందించింది. రెండు విడతల కరువు భత్యం (డీఏ)లను రిలీజ్‌‌‌‌ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా  బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెం. 128 ప్రకారం 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే డీఏను ప్రాథమిక వేతనంపై 33.67 శాతం నుంచి 37.31 శాతానికి (3.64 శాతం పెంపు) సవరించారు. అలాగే, జీవో నెం. 130 ప్రకారం 2024 జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి (2.73 శాతం పెంపు) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రెండు ఉత్తర్వుల ద్వారా ఉద్యోగులకు మొత్తం 6.37 శాతం మేర కరవు భత్యం పెరిగింది. ఈ సవరించిన డీఏను 2026 అక్టోబర్​కు సంబంధించిన జీతంతో కలిపి నవంబర్ 1న   చెల్లించనున్నారు. ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జిల్లా పరిషత్‌‌‌‌లు, మండల పరిషత్‌‌‌‌లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జ్‌‌‌‌డ్‌‌‌‌ ఎస్టాబ్లిష్‌‌‌‌మెంట్ సిబ్బంది, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి వర్తిస్తాయి.

బకాయిల చెల్లింపులకు స్పష్టమైన మార్గదర్శకాలు

డీఏ బకాయిల  చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్​) సౌకర్యం ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి.. తొలి జీవో బకాయిలు (01.01.2024 నుంచి 30.09.2026 వరకు), రెండో జీవో బకాయిలు (01.07.2024 నుంచి 30.09.2026 వరకు) వారి జీపీఎఫ్ ఖాతాల్లోకి నేరుగా జమవుతాయి. 2027 జనవరి 31 నాటికి లేదా అంతకంటే ముందు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు చివరి 4 నెలల సర్వీసులో జీపీఎఫ్ చందా మినహాయింపు నిబంధన ఉన్నందున, వారి బకాయిలను  చెల్లిస్తారు.  ఇందులో తొలి జీవో బకాయిలను 33 సమాన నెలవారీ వాయిదాల్లో, రెండో జీవో బకాయిలను 27 సమాన నెలవారీ వాయిదాల్లో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌‌‌‌) ఉద్యోగులకు సంబంధించి.. 10 శాతం బకాయిలను ప్రభుత్వ వాటాతో కలిపి ప్రాన్ ఖాతాలకు జమ చేస్తారు. మిగిలిన 90 శాతం సొమ్మును తొలి డీఏకు 33 వాయిదాల్లో, రెండో డీఏకు 27 వాయిదాల్లో 2026 అక్టోబర్ జీతం నుంచి చెల్లిస్తారు. జీపీఎఫ్ లేని ఫుల్ టైమ్ కాంటింజెంట్ సిబ్బందికి కూడా వరుసగా 33, 27 వాయిదాల్లో నగదు చెల్లింపులు చేస్తారు. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల చట్టబద్ధ వారసులకు పూర్తి బకాయిలను ఒకేసారి అందజేస్తారు.

పే-స్కేళ్ల వారీగా సవరించిన డీఏ రేట్లు 

ఉత్తర్వుల ప్రకారం వేర్వేరు వేతన సవరణ నిబంధనల పరిధిలోని ఉద్యోగులకు డీఏ శాతాలను వేర్వేరుగా నిర్ధారించారు. 2020 సవరించిన పే-స్కేళ్ల  ప్రకారం 2024 జనవరి 1 నుంచి డీఏ 33.67% నుంచి 37.31%కి, 2024 జులై 1 నుంచి 37.31% నుంచి 40.04%కి పెరిగింది. పాత 2015 సవరించిన పే-స్కేళ్ల (ఆర్​పీఎస్​-2015) పరిధిలోని ఉద్యోగులకు తొలి విడతలో 73.344% నుంచి 78.06%కి, రెండో విడతలో 78.06% నుంచి 81.728%కి సవరించారు. ఇక యూనివర్సిటీలు, ప్రభుత్వ ఎయిడెడ్, అనుబంధ డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో యూజీసీ, ఏఐసీటీఈ-2016 పే-స్కేళ్లు తీసుకుంటున్న బోధనా సిబ్బందికి డీఏను తొలి జీవో ద్వారా 46% నుంచి 50%కి, రెండో జీవో ద్వారా 53 శాతానికి పెంచారు. యూజీసీ-2006 స్కేలు వర్తించే ఉద్యోగులకు డీఏను 230% నుంచి 239%కి, అనంతరం 246 శాతానికి సవరించారు.  జీవో నెం. 171 ప్రకారం నెలకు రూ. 6,700 వేతనం పొందుతున్న ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులకు రెండు విడతల్లో వరుసగా 7.704%, 5.992% చొప్పున పెంచడంతో మొత్తం క్యుములేటివ్ రేటు 184.876 శాతానికి చేరింది. పార్ట్ టైమ్ అసిస్టెంట్లు, వివిధ శాఖల్లో సర్దుబాటు అయిన  వీఆర్‌‌‌‌ఏలకు 2024 జనవరి 1 నుంచి నెలకు రూ. 100, 2024 జులై 1 నుంచి మరో రూ. 100 చొప్పున తాత్కాలికంగా అడ్-హాక్ పెంపును మంజూరు చేశారు.

నిధుల వినియోగానికి ప్రత్యేక నిబంధనలు

ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి డ్రాయింగ్ అండ్ డిస్‌‌‌‌బర్సింగ్ అధికారులు, ట్రెజరీ విభాగాలు అనుసరించాల్సిన నిబంధనలను ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రయోజనం కోసం ఫండమెంటల్ రూల్స్‌‌‌‌లో పే ప్రకారం పరిధిలోకి వచ్చే ప్రాథమిక అంశాల ఆధారంగానే లెక్కింపు చేపట్టాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల వ్యయానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. జీహెచ్‌‌‌‌ఎంసీ, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు సంబంధించిన డీఏ పెంపు వ్యయాన్ని ఆయా సంస్థలు తమ సొంత నిధుల నుంచే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

పే-స్కేళ్ల వారీగా సవరించిన డీఏ రేట్లు
 

పే-స్కేలు / వర్గం    2024 జనవరి 1 నుంచి    2024 జులై 1 నుంచి 
2020 సవరించిన పే-స్కేళ్లు    33.67% -37.31%    37.31% -40.04%
ఆర్‌‌‌‌పీఎస్-2015 (పాత పే-స్కేళ్లు)    73.344% - 78.06%    78.06% - 81.728%
యూజీసీ, ఏఐసీటీఈ-2016 స్కేళ్లు    46% - 50%    53%
యూజీసీ-2006 స్కేలు    230%- 239%    246%