
ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఐదు కోట్లు
మిగతావి 24 వేల రిజర్వాయర్లలో వదిలేందుకు మత్స్య శాఖ సన్నాహాలు
మత్సశాఖ పెంచుతున్నది 2 కోట్లే .. ఇ- టెండర్ల ద్వారా 78 కోట్లకుపైగా సేకరణ
ఈ ఏడాది 80.86 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ప్లాన్ రెడీ చేసింది. ప్రాజెక్టులు, డ్యామ్‌లతో ఐదు కోట్లు, రాష్ట్రంలోని 24వేల నీటివనరుల్లో మరో 75 కోట్లకుపైగా వదలాలని లక్ష్యం పెట్టుకుంది. జలాశయాల్లో కనీసం30 శాతం నీరు వచ్చినా చేపలు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే మత్స్య శాఖ వద్ద రెండు కోట్ల పిల్లలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగత 78 కోట్లకు పైగా పిల్లల్ని టెండర్లు పిలిచి సేకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఏడాది అదనంగా ప్రాజెక్టులు అదుబాటులోకి వస్తుండడంతో గతేడాది కంటే ఎక్కువ చేపపిల్లలు వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. గతేడాది 75 కోట్ల పిల్లలను వదలాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే 49.15కోట్లు మాత్రమే వదలగలిగింది. చెరువులు, జలాశయాల్లో నీటి కొరతో లక్ష్యం చేరుకోలేకపోయినట్లు తెలిపింది. ఈ ఏడాది పరిస్థితులు మెరుగ్గా ఉండడంతో గతం కంటే 5 కోట్లు ఎక్కువగా మొత్తం 80. 86 కోట్ల చేపపిల్లలను వదలాలని నిర్ణయించారు. అయితే మత్స్యశాఖ వద్ద రెండు కోట్ల పిల్లలు మాత్రమే అందుబాటులో ఉండడంతో మిగతావి ఇ-–టెండర్ల ద్వారా సేకరించనున్నారు.
టెంటర్ల ద్వారా సేకరిస్తున్న వాటిలో 60శాతం తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, నల్గొండ, కరీంనగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట్ ఏరియాల్లోని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాల నుంచి… 40శాతం ఏపీలోని కేంద్రాల నుంచి ఉంటున్నాయి. జలాశయాల్లో 30శాతం నీటి వచ్చినా వదులుతామని అధికారులు చెబుతున్నారు. మత్స్యశాఖ 2015-–16లో 598 నీటివనరుల్లో 5.33 కోట్ల చేపపిల్లలను వదిలింది. ఇలా గతేడాది వరకు రూ.117.42 కోట్లతో 133.35 కోట్ల చేపపిల్లలను వదిలింది. దీంతో రాష్ట్రంలో చేపల వృద్ధి గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది నాలుగు లక్షల టన్నుల మత్ససంపద లక్ష్యంగా ప్లాన్ రూపొందించినట్లు చెబుతున్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.