
- బనకచర్ల, కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు భరోసా, స్థానిక ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం వంటి అంశాలపై చర్చించనున్నారు. వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలు, గత యాసంగి పెండింగ్ నిధుల చెల్లింపులపై డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గతంలో మాదిరి కాకుండా వారం రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, పార్టీ వ్యూహాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి.. ముందుగా పంచాయతీ ఎన్నికలా ? లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలా..? అనే దానిపై మంత్రుల అభిప్రాయాన్ని ఆయన తెలుసుకోనున్నారు. దానికి తగ్గట్టు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
ఇక యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల కార్యక్రమం పురోగతిపై కూడా సమీక్షించనున్నారు. ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్డీఎస్ఏ నివేదికలు, విజిలెన్స్ నివేదికలు.. అలాగే ప్రస్తుతం విచారణలో ఉన్న ఇతర ముఖ్యమైన కేసులపై మినిస్టర్స్‌తో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవలే ప్రమాణం చేసిన కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వారి పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది. కొత్త మంత్రులకు వారి శాఖల బాధ్యతలు, ప్రభుత్వం లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేసే చాన్స్ ఉంది.