ఒకేసారి రైతు బంధు సాయం అందే ఛాన్స్ కనిపించడం లేదే

ఒకేసారి రైతు బంధు సాయం అందే ఛాన్స్ కనిపించడం లేదే

హైదరాబాద్, వెలుగు:

ఇక నుంచి రైతులందరికీ ఒకేసారి రైతు బంధు సాయం అందే ఛాన్స్​ కనిపించడం లేదు. ముందుగా చిన్న కమతాలున్న రైతుల కు, తర్వాత పెద్ద కమతాలున్న రైతులకు పైసలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక లోటు కారణంగా రైతు బంధు అమలులో మార్పులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందుగా మూడు ఎకరాలలోపు భూములున్న రైతులకు వారి బ్యాంక్​ ఖాతాల్లో పైసలు వేసి.. అటు తర్వాత ఐదెకరాల లోపు భూములున్న రైతులకు వారివారి బ్యాంక్​ ఖాతాల్లో పైసలు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐదెకరాల పైన భూములున్న రైతుల విషయంలో మాత్రం జాప్యం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రైతు బంధు కింద ఖరీఫ్​ కాలానికి ఖరీఫ్​లోనే, రబీ కాలానికి రబీలోనే రైతు బంధు పైసలు విడుదల చేశారు. కానీ రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. రబీ సీజన్​ స్టార్టయినా ఇప్పటివరకు చాలా మంది రైతులకు ఖరీఫ్​ సీజన్​ రైతు బంధు పైసలు అందలేదు.

మున్సిపోల్స్​ దృష్ట్యా ముందుగా వెయ్యి కోట్లు!

ప్రస్తుతం రబీ సీజన్​ నడుస్తున్నందున రైతు బంధుకు సుమారు 7 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  కానీ మొదటి విడతలో వెయ్యి కోట్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలు రానున్న దృష్ట్యా చిన్న రైతులకు  అంటే మూడు ఎకరాల లోపు భూములున్న రైతులకు ముందుగా డబ్బులు వేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. అటు తర్వాత ఐదెకరాల లోపు భూములున్న రైతులకు రైతు బంధు సాయం అందజేసే అవకాశం ఉంది. జీఎస్టీ పరిహారం కింద తాజాగా కేంద్రం రూ. 1,036 కోట్లు విడుదల చేసింది. అందులో నుంచి వెయ్యి కోట్లను రైతు బంధుకు కేటాయించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ‘లిక్కర్ రేట్లు పెంచడంతో ప్రతి నెల రాష్ట్ర ఖజానాకు రూ. 400 కోట్ల అదనపు ఆదాయం వస్తోంది. ఈ అదనపు ఆదాయాన్ని నేరుగా రైతు బంధుకు మళ్లించే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు.

కమతాల వారీగా ఏడాదంతా పంపిణీ

రైతు బంధు కింద సుమారు 52 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం మూడెకరాల్లోపు వాళ్లే. తర్వాత ఐదెకరాలలోపు వాళ్లు ఉన్నారు. ముందు మూడెకరాలలోపు వాళ్లకు, తర్వాత ఐదెకరాలలోపు వాళ్లకు, ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఐదెకరాలకు పైన భూములున్నోళ్లకు రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం జమ చేయాలని చూస్తోందని, ఇలా ఏడాది పొడవునా ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు. ఖరీఫ్​కు సంబంధించిన డబ్బులు ఖరీఫ్​లోనే, రబీ కాలానికి సంబంధించిన డబ్బులు రబీ కాలంలోనే వేయాలనే కండిషన్ ఇక నుంచి ఉండకపోవచ్చని తెలిపారు.

ఖరీఫ్​ పైసల సంగతి ఏంది?

మొన్నటి ఖరీఫ్​లో సమారు 15 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 1,500 కోట్లు రైతు బంధు ఇవ్వలేదు. ఈ డబ్బులను ఎప్పుడు ఇస్తారనే దానిపై కూడా ఆర్థికశాఖ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. వనరుల సమీకరణ మేరకు ఇస్తామని చెబుతోంది. అయితే ఖరీఫ్​ కాలం ముగిసి రబీ కాలం ప్రారంభమైంది. పాత డబ్బులు వస్తాయా.. లేదా.. అనే అనుమానాలు మాత్రం రైతుబంధు అందని రైతులను వెంటాడుతున్నాయి.