ఆగస్టులో తెలంగాణ సర్కార్ ఆదాయం రూ. 31 వేల కోట్లు

ఆగస్టులో తెలంగాణ  సర్కార్ ఆదాయం రూ. 31 వేల కోట్లు

 ఓఆర్ఆర్ లీజు, భూముల వేలంతోనే 12 వేల కోట్లు 

కాగ్ రిపోర్టులో వెల్లడి  

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ భూముల అమ్మకంతో భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నది. ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో భూముల అమ్మకంతో పాటు ఓఆర్ఆర్ లీజు ద్వారా రూ.14,482 కోట్లు ఆర్జించింది. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఒక్క ఆగస్టులోనే ఏకంగా రూ.12 వేల కోట్లకు పైగా రాగా.. ఏప్రిల్, మే, జూన్, జులై నెలల్లో రూ.2 వేల కోట్ల లోపే వచ్చింది.

 కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శుక్రవారం విడుదల చేసిన ఐదు నెలల రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో కలిపి ప్రభుత్వానికి మొత్తం రూ.99,106 కోట్ల ఆదాయం వచ్చిందని అందులో పేర్కొంది. ఇందులో ఒక్క ఆగస్టు లోనే రూ.31,612 కోట్ల ఆదాయం వచ్చిందని కాగ్ తెలిపింది. ఈ ఆదాయంలోనూ భూముల వేలం, ఓఆర్ఆర్ లీజు ద్వారా వచ్చిందే రూ.12 వేల కోట్లు ఉందని చెప్పింది. కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్ల గ్రాంట్ వచ్చిందని పేర్కొంది. 

ఆగస్టులో ప్రభుత్వం రూ.5,500 కోట్ల అప్పు కూడా తీసుకుందని తెలిపింది. అందుకే ఆగస్టులో సర్కార్ ఆదాయం ఎగబాకింది. కాగా, ఈ ఏడాది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద రూ.22 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్​లో అంచనా వేసింది. ఇందులో భూముల అమ్మకం ద్వారానే కనీసం రూ.18 వేల కోట్లు సమకూర్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల కింద రూ.41 వేల కోట్లు వస్తాయని బడ్జెట్ లో అంచనా వేసింది.