
- స్కీం రద్దయి ఏడాదిన్నర దాటినా.. సభ్యులకు వాటా వాపస్ చేయని సర్కారు
- రాష్ట్ర ప్రభుత్వం వద్దే రూ.1500 కోట్లు
- ఏపీ తరహా తెలంగాణలోనూ ప్రభుత్వం అవసరాలకు వాడుకున్నట్లు అనుమానాలు
- లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వడంలోనూ జాప్యం
హైదరాబాద్, వెలుగు: అభయ హస్తం పథకాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మహిళలు చెల్లించిన వాటాను తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. స్కీమ్ రద్దు సందర్భంగా లబ్ధిదారుల్లోని అర్హులకు ఆసరా పెన్షన్లు ఇస్తామని, అర్హులు కాని వారికి స్కీమ్ కోసం కట్టిన డబ్బును వాపస్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రభుత్వం.. ఏడాదిన్నర అవుతున్నా డబ్బులు వాపస్ చేయడం లేదు. అటు అభయ హస్తం స్కీమ్ ఆగిపోయి.. ఇటు ఆసరా పెన్షన్ రాక రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏండ్లు నిండాక పెన్షన్ వస్తుందనే ఆశతో ఏడెనిమిదేండ్లు తాము ప్రీమియం చెల్లించామని, తెలంగాణ వచ్చాక అభయహస్తం చట్టం రద్దు చేయడంతో తమకు పెన్షన్ రాకుండా పోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 57 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆసరా స్కీమ్ ను.. భర్తకు వచ్చే పెన్షన్ తో సంబంధం లేకుండా తమకూ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
23.28 లక్షల మంది మహిళలు..
2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభయ హస్తం పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ స్కీమ్ లో చేరిన మహిళలకు 60 ఏండ్లు నిండగానే నెలనెలా రూ. 500 పెన్షన్ ఇచ్చే వారు. భర్తకు వచ్చే రూ. 200 వృద్ధాప్య పెన్షన్‌తో సంబంధం లేకుండా అభయ హస్తంలో చేరిన మహిళకు కూడా పెన్షన్ వచ్చేది. దీంతో ఈ స్కీమ్‌లో 23,28,014 మంది సభ్యులుగా చేరారు. వీళ్లలో తెలంగాణ ఏర్పాటు నాటికి 2.20 లక్షల మంది అభయ హస్తం పెన్షన్ తీసుకునేవారు. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ స్కీమ్ కింద రూ.1000 ఇస్తున్నారు. ఈ స్కీమ్‌కు అర్హులైన1,33,415 మంది అభయ హస్తం సభ్యులను ఆసరా పరిధిలోకి మార్చారు. మిగతా 86,597 మందికి 2016 అక్టోబర్ నుంచి అభయ హస్తం పెన్షన్ నిలిచిపోయింది. నాలుగున్నరేండ్లుగా రాష్ట్రంలో వారికి ఎలాంటి పెన్షన్ రావట్లేదు. ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. అప్పటికే1.90 లక్షల మంది మహిళలను ఆసరా పెన్షన్‌కు అర్హులుగా అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఈ సంఖ్య ప్రస్తుతం మరో లక్ష వరకు పెరిగిందని అంచనా. వీరంతా ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.
1500 కోట్లు ఎటుపోయినట్టు..
అభయహస్తం స్కీమ్‌లో చేరిన మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 365 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో జమచేసేది. ఇలా జమ అయిన డబ్బులు రూ.1,500 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ డబ్బులు ఎల్ఐసీ వద్ద ఉన్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఆసరా పరిధిలోకి వచ్చే మహిళలకు ఆసరా పెన్షన్ ఇస్తామని, ఈ స్కీమ్ పరిధిలోకి రానోళ్లకు డబ్బులు వాపస్ ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఏడాదిన్నర గడిచినా వారికి డబ్బులు వాపస్ ఇయ్యలేదు. అసలు రూ.1500 కోట్లు సర్కార్ దగ్గరే ఉన్నాయా.. ఇటీవల ఏపీ ప్రభుత్వం తరహాలోనే డ్రా చేసి దారి మళ్లించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులు తిరిగి ఇవ్వాలి..
అభయ హస్తం స్కీమ్ అనధికారంగా రద్దయి ఏడేండ్లు అవుతోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభయ హస్తం పెన్షన్లను సర్కార్ నిలిపివేసింది. కానీ మహిళలు చెల్లించిన డబ్బులను మాత్రం వాపస్ ఇవ్వలేదు. అభయ హస్తంలో చేరిన వారంతా నిరుపేదలే. వారందరికీ చెల్లించిన డబ్బులు తిరిగివ్వాలి. ఇదే విషయంపై సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తోపాటు సీఎస్ సోమేశ్ కుమార్, సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియాకు వినతిపత్రం ఇచ్చాను.
-గవినోళ్ల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త, నారాయణపేట