గతేడాది కోటా నీళ్లను ఇప్పుడు వాడుకుంటం..KRMB కి సర్కార్ లేఖ

గతేడాది కోటా నీళ్లను ఇప్పుడు వాడుకుంటం..KRMB కి సర్కార్ లేఖ

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్ లోని కామన్ రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ లో గతేడాది కోటాలో వాడుకోలేకపోయిన నీళ్లను,  ఇప్పుడు వాడుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కు తెలిపింది. ఈ మేరకు ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ హరికేశ్ మీనాకు శుక్రవారం లెటర్ రాశారు. గతేడాది తెలంగాణకు చేసిన కేటాయింపుల్లో50.85 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి వాడుకోవాల్సిఉందన్నారు. ఆగస్టు నెలాఖరు వరకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు గతేడాది కోటాను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు సాగు, తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి కల్వకుర్తికి 7.74 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటికి 7.74 టీఎంసీలు, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీకి 22.18 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరారు. కల్వకుర్తి నుంచి తీసుకునే నీటికి వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలని, సాగర్ నుంచి తీసుకునే నీటిని గతేడాది కోటా క్యారీ ఓవర్ నుంచి మినహాయించాలన్నారు.